శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ఆసిఫాబాద్: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ నితికా పంత్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ యాపల్‌గూడ రెండో పోలీస్ బెటాలియన్ నుంచి బదిలీపై వచ్చిన నితికా పంత్ శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపారు. అంతకుముందు పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉండి చట్టపరమైన సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాలికలు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గతంలో సంగారెడ్డి ఏఎస్పీగా, మేడ్చల్ డీసీపీగా, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఆదిలాబాద్ బెటాలియన్ కమాండెంట్‌గా నితికా పంత్ విధులు నిర్వర్తించారు. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం ఇప్పటివరకు తొమ్మిదిమంది ఎస్పీలు ఇక్కడ విధులు నిర్వహించారు. తాజాగా తొలి మహిళా ఎస్పీగా నితికా పంత్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.


