‘ప్రైవేటు’లోనూ దక్కని ప్రాణం..! | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు’లోనూ దక్కని ప్రాణం..!

Nov 22 2025 7:24 AM | Updated on Nov 22 2025 7:24 AM

‘ప్రైవేటు’లోనూ దక్కని ప్రాణం..!

‘ప్రైవేటు’లోనూ దక్కని ప్రాణం..!

ప్రైవేటు ఆస్పత్రుల్లో చిన్నారుల మృత్యువాత రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా బతకని వైనం వైద్యుల తీరుపై బంధువుల అసహనం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సర్కారు దవాఖానాలో పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే అక్కడా ప్రాణాలకు భరోసా లేకుండా పో తోంది. జిల్లా కేంద్రం మంచిర్యాలలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించడం ఆందోళన కలిగి స్తోంది. రెండ్రోజుల క్రితం జగిత్యాలకు చెందిన నాలుగు నెలల బాలుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్‌కు చెందిన ఓ బాలికకు జ్వరం రాగా వారం రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రక్తకణాలు తక్కువగా ఉన్నట్లు చెప్పి చికిత్స చేస్తున్న వైద్యులు.. ఆకస్మాత్తుగా గురువారం రాత్రి నుంచే బాలిక పరిస్థితి విషమించింది. పరిస్థితి చేయి దాటాక కుటుంబ సభ్యులకు చెప్పి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ సూచించారు. ముందస్తుగానే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి భద్రత ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. బాలిక ఉదయమే చనిపోయినా ఆస్పత్రి యాజమాన్యం చెప్పకుండా రాత్రి వరకు హైడ్రామా నడిపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు పరిస్థితి గమనించి పలుమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోయారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల తర్వాత ఆందోళన చేశారు. గతంలోనూ ఈ ఆస్పత్రిలో ఓ చిన్నారి చనిపోయిన ఘటన జరిగింది.

సర్కారులో అరకొర వైద్యం

జిల్లా ఆస్పత్రితో సహా కమ్యూనిటీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరకొర వైద్య సేవలే అందుతున్నాయి. జిల్లా ఆస్పత్రికి నిత్యం వందలాది మంది ఓపీ వస్తున్నారు. వారి నాడీ పట్టి చూడకుండానే ఓపీ చీటిపై నాలుగైదు రకాల మందులు రాసి పంపిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే తప్ప శ్రద్ధ వహించడం లేదు. ఈ నెల 10న మందమర్రికి చెందిన కాసర్ల తిరుపతి తన కొడుకు హర్షవర్ధన్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని నేరుగా ప్రజావాణిలో కలెక్టర్‌కే ఫిర్యాదు చేశాడు. చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాల వారు డబ్బు ఖర్చు చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. సర్కారు దవాఖానాల్లో పని చేస్తున్న చాలామంది వైద్యులు తమ సొంత క్లినిక్‌లను నడుపుతున్నారు. ఇటీవల ఓ మహిళ చెవి నొప్పితో జిల్లా ఆస్పత్రికి వెళ్లగా.. ఓసారి చెవిని చూసి ఓ చీటిపై మందులు రాసి మరో చీటి ఇచ్చి తమ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటూ రెఫర్‌ చేశారు.

పర్యవేక్షణ కరువు

ప్రైవేటు ఆస్పత్రులు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ తనిఖీలు కరువయ్యాయి. ఆస్పత్రుల అనుమతులు, రెన్యూవల్‌ చేసేటప్పుడు కనీస సౌకర్యాలు ఉన్నాయా..? లే వా..? అని పర్యవేక్షించడం లేదు. గతంలో పలు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. పలు క్లినిక్‌ల్లో అర్హతలకు మించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. అలాంటి ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ప్రైవేటు ఆస్పత్రుల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో ఇటీవల కాలంలో అత్యవసర సేవలు, మాతాశిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులు, ఆపరేషన్లు చేస్తూ రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. ఇక గుండె, ఆర్థో సంబంధిత వైద్యంతోపాటు పలు రకాల చికిత్సలు ఇక్కడే జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటుకు యాజమాన్యం విపరీతమైన ఖర్చులు చేస్తున్నాయి. దీంతో ఆ పెట్టుబడి మళ్లీ రాబట్టేందుకు రోగులపై ఫీజుల భారం మోపుతున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ డ్రైవర్లు, మధ్యవర్తులతో రెఫర్‌ చేయిస్తూ కమీషన్లు ఇస్తున్నారు. వీటన్నింటిపైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే నియంత్రణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement