సమస్యాత్మక కేంద్రాల జాబితా అందించాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిలతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్ ఇన్‌స్పెక్టర్లతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో తీసుకోవా ల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గొడవలు జరిగిన, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను తహసీల్దార్, ఎంపీడీవో, సబ్ ఇన్‌స్పెక్టర్ సంతకాలతో అందించాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డెడికేషన్ కమిటీ కేటాయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ నెల 22లోగా ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ, 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌లు, సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


