ధాన్యం మాయం..!
కౌటాల మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో ఈ నెల 19న ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. మిల్లులో 1,353.700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యంలో 33,842 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ధాన్యాన్ని దారి మళ్లించిన సదరు మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించారు.
సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేట్‌లోని ఓ రైస్ మిల్లులో ఈ నెల 17న అధికారులు తనిఖీలు నిర్వహించారు. 43,190 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లును సీజ్ చేశారు... ఇలా జిల్లాలో పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి లబ్ధి పొందుతున్నారు.
కౌటాల(సిర్పూర్): ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం తీసుకున్న వరి ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. సీఎంఆర్ దందా ద్వారా అక్రమంగా రూ.కోట్లలో సంపాదిస్తున్నారు. ఏడాదికి రెండు సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన రైస్ మిల్లులకు అప్పగిస్తోంది. నిబంధనల ప్రకారం 67 శాతం బియాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఈ ప్రక్రియను కొంతమంది మిల్లర్లు అక్రమ ధనార్జనకు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్నబియ్యాన్ని కొని సీఎంఆర్‌గా అప్పగిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో అధికారులు దాడులు చేయగా, వేలాది బస్తాలు మాయం అయినట్లు గుర్తించారు.
గడువు ముగిసినా అంతే..
జిల్లాలో 2022– 23 సంవత్సరానికి సంబంధించి మూడు మిల్లుల నుంచి 58 ఏసీకేలు(ఒక్క ఏసీకే 290 క్వింటాళ్లు), 2023– 24కు సంబంధించి 98 ఏసీకేలు రావాలి. ఈ మిల్లర్లకు పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినా లెక్క చేయడం లేదని తెలుస్తోంది. అలాగే 2024– 25లో యాసంగి సీజన్‌కు సంబంధించి పది మిల్లులకు 7,593 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ వరకు గడువు ముగిసింది. ఇంకా 28 ఏకేసీల బియ్యం అప్పగించాల్సి ఉంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి 13 మిల్లులకు 10,695 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. అక్టోబర్ 31తో గడువు ముగిసింది. ఇప్పటికీ ఇంకా 41 ఏసీకేల బియ్యం పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం మళ్లీ గడువు పెంచుతుందనే ఆశతో బియ్యం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది.
వేల బస్తాలు పక్కదారి..
అధికారులు చేపట్టిన తనిఖీల్లో సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేట్‌లోని ఓ రైస్ మిల్లులో దాదాపుగా రూ.4.45 కోట్ల విలువైన 43,190 బస్తాల ధాన్యం, కౌటాలలోని మరో రైస్ మిల్లులో రూ.3.50 కోట్ల విలువైన 33,842 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సిర్పూర్(టి), కౌటాల మండలాల్లోని రైస్ మిల్లుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 77 వేల ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు మిల్లులోనే ఈ స్థాయిలో ధాన్యం గోల్‌మాల్ జరిగితే.. మిగితా మిల్లుల్లో పరిస్థితి ఎలా ఉందో ప్రశ్న తలెత్తుతోంది. తనిఖీలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం.. ఆస్తులను జప్తు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని, వారికి మళ్లీ ధాన్యం ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేపడుతున్నాం
జిల్లాలోని రైస్ మిల్లుల్లో తరుచూ తనిఖీలు చేపడుతున్నాం. మిల్లుల్లో ధాన్యం బస్తాలు తక్కువగా ఉంటే పూర్తిస్థాయిలో పంచనామా నిర్వహించి సీజ్ చేస్తాం. మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాలి. సకాలంలో బియ్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటాం.
– వసంత లక్ష్మి, డీసీఎస్‌వో


