బడులకు నిధుల వరద
విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు ఎమ్మార్సీ, స్కూల్ కాంప్లెక్స్‌లకు కూడా.. పదిలోపు పిల్లలు ఉన్న పాఠశాలలకు విడుదల కాని నిధులు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడత నిధులు మంజూరయ్యాయి. 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 శాతం నిధుల ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మండల విద్యా వనరుల కేంద్రం, క్లస్టర్ పాఠశాల సముదాయాలకు కూడా నిధులు మంజూరయ్యాయి. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఊరట లభించనుంది.
నిధులు విడుదల ఇలా..
జిల్లాలోని 715 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త, ఆశ్రమ పాఠశాలలతోపాటు 67 స్కూల్ కాంప్లెక్స్ సముదాయాలు, 15 ఎమ్మార్సీలకు మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. ఆయా పాఠశాలల్లో 37,510 మంది విద్యార్థులు చదువుతున్నారు. 15 ఎమ్మార్సీలకు ఒక్కో దానికి రూ.45,000, 67 క్లస్టర్ పాఠశాల సముదాయాలకు రూ.16,500 చొపున విడుదలయ్యాయి. బడిబాట కోసం ప్రాథమిక పాఠశాలలకు రూ.1000, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2000, గర్ల్స్ చైల్డ్ ఎంపవర్‌మెంట్‌కు వందశాతం మంజూరయ్యాయి. పాఠశాలలకు రూ.500 చొప్పున కేటాయించారు. రెండేళ్ల నుంచి నిధులు వేగంగా మంజూరవుతుండడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిధుల వినియోగానికి సంబంధించి మాత్రం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్ట(పీఎఫ్‌ఎంఎస్)తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
ప్రభుత్వం పాఠశాల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏటా రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తుంది. విద్యార్థులు 1 నుంచి 30 మంది ఉంటే రూ.10 వేలు, 31 నుంచి వంద మందిలోపు ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 500 మంది వరకు ఉంటే రూ.75 వేలు చొప్పున కేటాయిస్తారు. ఈ నిధులను తాగునీటి, పాఠశాలలకు సంబంధించిన చిన్నపాటి మరమ్మతులు, చాక్‌పీసులు, రిజిస్టర్లు, ఇతర రికార్డులు కొనుగోలు, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ఇక మండలాలకు ఎంతో కీలకంగా ఉన్న ఎమ్మార్సీల్లో మండల విద్యాధికారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవో, మెసెంజర్లు విధులు నిర్వహిస్తారు. వీటికి మంజూరైన నిధులను విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఫర్నీచర్, కంప్యూటర్ల మరమ్మతు, ఇంటర్నెట్ బిల్లులు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం వెచ్చించనున్నారు. అయితే ఈసారి పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు నిధులు విడుదల చేయలేదు.
జిల్లాకు మంజూరైన నిధులు
కాంపొనెంట్ పాఠశాలలు నిధులు
స్కూల్ గ్రాంటు 715 రూ.77,10,000
బడిబాట 688 రూ.8,81,000
గర్ల్స్ ఎంపవర్‌మెంట్ 98 రూ.49,000


