ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గవర్నర్ ఏడీసీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్‌గూడ పోలీస్ కమాండెంట్ నితిక పంత్ జిల్లాకు రానున్నారు.
ఐదున్నర నెలలకే..
జూన్ 5న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా కాంతిలాల్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఐదున్నర నెలలు మాత్రమే విధులు నిర్వర్తించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు. ముఖ్యంగా గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. డ్రోన్ కెమెరాలతో మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగును గుర్తించి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 72 గంజాయి కేసులు నమోదు చేసి, 122 మందిని అరెస్టు చేశారు. రూ.1,15,41,002 విలువైన 2,245కిలోల గంజాయిని పట్టుకున్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపి నిందితులను అరెస్టు చేయించారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన గుజరాత్‌కు చెందిన పంకజ్ లాలాజీ, శైలేష్ సల్లుభాయ్‌లను అరెస్టు చేసి, డబ్బులు రికవరీ చేయించారు. సైబర్ నేరాల నుంచి రక్షించుకునే విధానాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.


