బడుల బలోపేతం దిశగా..
కెరమెరి(ఆసిఫాబాద్): పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర విద్యాశాఖ నూతన ప్రణాళికలు అమలు చేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూనే.. ఉపాధ్యాయులకు సైతం ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్ర, శనివారాల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణపై విధివిధానాలపై ఎస్పీడీ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమావేశాలు ఇలా..
జిల్లాలో 67 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో అన్ని యాజామాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలలు 992 ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న 2,200 మంది స్కూల్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు శుక్రవారం నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఉపాధ్యాయులందరికీ ఒకేసారి కాకుండా ప్రాథమిక తరగతులు బోధించే టీచర్లలో ఈ నెల 21న సగం మందికి, 22న మిగిలిన వారికి సమావేశాలు కొనసాగుతాయి. అలాగే ఈ నెల 27న భాషా ఉపాధ్యాయులకు, ఈ నెల 28న ఇతర సబ్జెక్టుల వారికి సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. పీరియడ్, టాపిక్‌ల వారీగా వివరిస్తారు. స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్లను సైతం ఇటీవల 50శాతం విడుదల చేశారు. జిల్లాలోని 67 స్కూల్ కాంప్లెక్స్‌లకు రూ.6,21,900 మంజూరు చేయగా, ఒక్కో ఎమ్మార్సీకి రూ.41,460 చొప్పున అందాయి.
వీటిపైనే చర్చ..
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తే వారికి సులువుగా అర్థమవుతుందనే అంశంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నారు. ఎస్‌ఏ, ఎఫ్‌ఏ పరీక్షల ఫలితాలు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, తొలిమెట్టు కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుండగా.. దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, గతేడాది నుంచి ఎంపిక పాఠశాలల్లో అమలు చేస్తున్న ఆర్టిఫిషియల్ బోధన ప్రగతిపై చర్చించనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో బోధన తీరును వివరిస్తారు. ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ సమావేశాల్లో సైన్స్ ప్రయోగాలు, పాఠశాల గ్రంథాలయాల బలోపేతం, అన్నిరకాల పరీక్షల ఫలితాలపై సమీక్షించనున్నారు. 2025– 26 స్కూల్ క్యాలెండర్ ప్రకారం ఏడు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, ఈ నెలతో నాలుగు సమావేశాలు పూర్తి కానున్నాయి.
సామర్థ్యాల పెంపునకు దోహదం
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాల పెంపునకు దోహదపడతాయి. ఉపాధ్యాయులందరూ ఈ సమావేశాలకు హాజరు కావాలి. రిసోర్స్‌పర్సన్లు వివరించే అంశాలపై అవగాహన పెంచుకుని, వాటిని పాఠశాలల్లో అమలు చేయాలి. చదువులో వెనుబడిన పిల్లలపై ప్రత్యేక శద్ధ వహించాలి.
– ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
బడుల బలోపేతం దిశగా..


