85.55 క్వింటాళ్ల బియ్యం స్వాహా
తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌకధరల దుకాణంలో భారీ అవినీతి బయటపడింది. పేదలకు పంపిణీ చేయాల్సిన 85.55 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని సేల్స్‌మెన్ పక్కదారి పట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నవంబర్ నెలలో పంపిణీ చేయాల్సిన సన్నబియ్యం పూర్తిస్థాయిలో అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఆలస్యంగా బయటపడిన అవినీతిపై తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా వివరాలు వెల్లడించారు. ఈ– పాస్ మిషన్ ప్రకారం గతంలో మిగిలిన 94 క్వింటాళ్లు బియ్యంతోపాటు నవంబర్‌కు సంబంధించి మరో 83.94 క్వింటాళ్ల బియ్యం జీసీసీకి వచ్చాయని తెలిపారు. 175 క్వింటాళ్ల నుంచి సేల్స్‌మెన్ కుర్సెంగా రత్నకిశోర్ ఈ–పాస్ ద్వారా 97.45 క్వింటాళ్లను మాత్రమే పంపిణీ చేశాడని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు ఆర్‌ఐతో విచారణ చేపట్టగా.. మిగతా 85.55 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించి లెక్కలు చూపెట్టలేదన్నారు. దీంతో సదరు సేల్స్‌మెన్‌పై కేసు నమోదు చేసి, సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. అవినీతికి పా ల్పడిన సేల్స్‌మెన్ నుంచి బియ్యాన్ని రికవరీ చేయించి, డిసెంబర్‌లో రెండు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని సివిల్ సప్‌లై అధికారులు వెల్లడించినట్లు తహసీల్దార్ తెలిపారు.


