పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతి భద్రత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డెడికేషన్ కమిటీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామని వివరించారు. ఈ నెల 23 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా ఆడిట్ అధికారి రాజేశ్వర్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


