గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
ఆసిఫాబాద్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన విజ్ఞానం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉందన్నారు. పుస్తక పఠనాన్ని ప్రతిఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అన్నిరకాల పుస్తకాలతోపాటు వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు.


