‘ఎండీఎం’ నిర్వాహకులకు ఊరట
ఆసిఫాబాద్‌అర్బన్: మధ్యాహ్న భోజన ధరలను ప్రభుత్వం పెంచడంతో నిర్వాహకులకు ఊరట లభించనుంది. నిత్యావసర ధరలతో వంట చేసేందుకు సతమవుతుండగా, ఎట్టకేలకు రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఒకే నెలలో రెండుసార్లు పెంపు ఉత్తర్వులు రావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద 992 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 42,370 మంది విద్యార్థులు చదువుతున్నారు. ధరల పెరగడంతో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహాలతో కూడిన ఆహారం అందనుంది. ఒక్కో విద్యార్థి భోజనం కోసం చేసే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయి. వారంలో మూడు రోజుల విద్యార్థులకు కోడిగుడ్లు అందిస్తుండడంతో పెంచిన వాటి ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి భోజన నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటనతో పరిస్థితి కొంతమేర మారనుంది.
పెంపు ఇలా..
ప్రభుత్వం పెంచిన ధరలు మే 1 నుంచి అమలు లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద 1,491 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 25,540 మంది ఉండగా, వీరికి రోజుకు రూ.6.78 చొప్పున చెల్లించనున్నారు. అలాగే ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న వారు 10, 579 మంది ఉండగా, ఒక్కొక్కరికి రూ.10.17 చొ ప్పున, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 6,251 మందికి రూ.13.17 చొప్పున చెల్లించనున్నారు.
సకాలంలో అందని బిల్లులు
మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరా చేస్తోంది. మిగిలిన కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాల్సి ఉంది. వీటికి ప్రభుత్వం ప్రతినెలా బిల్లులు చెల్లిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. అలాగే గ్యాస్ భారం కూడా ఇబ్బందిగా మారింది. అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం వండిపెట్టడం ఇబ్బందిగా మారిందని, బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.
ఎండీఎం ధర పెంపు వివరాలు
తరగతి గత నెలలో ఈ నెల 4న ప్రస్తుతం
1–5 రూ.5.45 రూ.6.19 రూ.6.78
6–8 రూ.8.17 రూ.9.29 రూ.10.17
9–10 రూ.8.17 రూ.9.29 రూ.13.17


