ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలు, గృహ నిర్మాణ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, ఇంటి పన్నుల వసూళ్లు, సెర్ప్ కార్యకలాపాలు, ఉపాధిహామీ పథకం పనుల గుర్తింపు అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల పనులు వందశాతం ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటి పన్ను వందశాతం వసూలు చేసి పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఏకరూప చీరల పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకాశ్‌రావు తదితరుల పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కాగజ్‌నగర్‌రూరల్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. కాగజ్‌నగర్ మండలం చింతగూడలోని ఎంపీయూపీఎస్, కేజీబీవీలను బుధవారం సందర్శించారు. వసతులు, మధ్యాహ్న భోజనం, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అనంతరం కాగజ్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.


