
తరలివచ్చి.. వినతులిచ్చి
● ప్రజావాణికి క్యూ కట్టిన ప్రజలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి వినతులు సమర్పించారు. బాధితుల సమస్యలు విన్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం పర్షనంబాలకు చెందిన ఆదే మాధవ్ దరఖాస్తు చేసుకున్నాడు. తాను సాగు చేసుకుంటున్న భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ కాలనీకి చెందిన గౌరోజు శోభ కలెక్టర్‌ను కోరింది. ఆసిఫాబాద్ మండలం సామెల శివారులోని తన పట్టా భూమికి కొత్త పట్టా పాస్ పుస్తకం జారీ చేయాలని జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్‌కు చెందిన సోమ శంకర్ విన్నవించాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని బజార్‌వాడికి చెందిన కాంబ్లె నీలాబాయి దరఖాస్తు చేసుకుంది. తన కుమారుడికి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు ఇప్పించాలని కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం గ్రామానికి చెందిన గోలేటి శ్రీనివాస్ కోరాడు. తన పేరుతో ఉన్న పట్టా భూమికి కొత్త పట్టా పాస్‌బుక్ జారీ చేయాలని కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన బర్ల శంకరక్క అర్జీ సమర్పించింది. బీఎస్సీ, బీఈడీ చదివిన తనకు అర్హత గల ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని జైనూర్ మండలం కొండిబగూడకు చెందిన సోన్ కాంబ్లే దరఖాస్తు చేసుకుంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నాడని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉపాధి కల్పించాలని కెరమెరి మండలం గౌరి గ్రామానికి చెందిన తాగ్రే కవిత వేడుకుంది. వాంకిడి మండలం సరండి గ్రామ శివారులోని తమ పట్టా భూమిలో 2 గుంటలు ఫోర్‌లైన్‌లో పోగా.. రికార్డులో తప్పుగా నమోదు చేశారని, వివరాలు సరిచేయాలని జిల్లా కేంద్రానికి చెందిన ఎకిరాల సంతోష్, గణపతి కోరారు. కెరమెరి మండలం దేవుడిపల్లి గ్రామ శివారులోని సర్వే నం.7లోని ఐదెకరాల పట్టా భూమిని నలుగురు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని తక్సండే శేఖర్ వేడుకున్నాడు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పొలాలకు దారిలేదు
‘బూర్గుడ శివారులోని సర్వే నం.15, 14తో పాటు పలు సర్వే నంబర్లలో పంట పొలాలకు వెళ్లేందుకు గతంలో ఉన్న దారిని ఇద్దరు వ్యక్తులు మూసివేశారు. వెనుకవైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. సుమారు 200 ఎకరాలకు దారి లేదు. విచారణ చేపట్టి రహదారి సౌకర్యం కల్పించాలి..’ అని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన రైతులు గెడెకర్ గణేశ్, సత్తె లింగు, శెండె విఠు, గణపతి తదితరులు కోరారు.

తరలివచ్చి.. వినతులిచ్చి