
యూరియా తిప్పలు!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కుమ్మరి రాజయ్య. రెబ్బెన మండలం నంబాల గ్రామంలో పదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం ఎనిమిది ఆకుల దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు ఎరువులు వేయాలి. రెబ్బెన పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ జరుగుతోందని తెలుసుకుని బుధవారం వెళ్లగా అధికారులు పాస్‌పుస్తకానికి రెండు బస్తాల చొప్పున చీటీ రాసి ఇచ్చారు. రెండురోజులుగా యూరియా బస్తాల కోసం పీఏసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తే.. గురువారం సాయంత్రం వరకు ఒక్క బస్తా అందలేదు. వారంలో పదెకరాలకు మందు వేయాల్సి ఉండగా.. అధికారులు ఇచ్చే రెండు యూరియా బస్తాలను ఎన్ని ఎకరాలకు సరిపెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నాడు.
జిట్టవేణి హన్మంతుది రెబ్బెన మండలంలోని కై రిగూడ. 12 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మూడు దఫాల్లో వేయాల్సిన యూరియా తప్పా మిగిలిన ఎరువులను ఫర్టిలైజర్ షాపులో కొన్నాడు. ఇక 60 యూరియా బస్తాల కోసం అడిగితే గంట మందు బస్తాలు కొంటేనే యూరియా అందిస్తామని షాపు యజమాని చెప్పడంతో కంగుతిన్నాడు. గంట మందు, యూరియా బస్తాలకు రూ.750 అవుతుందని చెప్పడంతో.. బుధవారం పీఏసీఎస్‌కు వచ్చాడు. అధికారులు కేవలం రెండు బస్తాలకే చీటీ రాసి ఇచ్చారు. బయట యూరియాతో ఇతర ఎరువులు ముడిపెడుతుండగా.. పీఏసీఎస్‌లో కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో ఏమీ పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. అన్ని మండలాల్లో రైతులు దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం పంటల సాగుచేస్తున్న రైతులు యూరియా బస్తాల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్‌లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపడడం లేదు. పత్తి పంటకు మొదటి దఫా ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఒకటి, రెండు బస్తాలు అందించి అధికారులు చేతులెత్తుతున్నారు. అరకొర అందిన యూరియా ఏ మూలకు వేయాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలు ఉండటంతో వారిపై అదనపు ఆర్థికభారం పడుతోంది.
ముందస్తు అవసరాల కోసం ఇప్పుడే..
జిల్లాలోలోని 15 మండలాల పరిధిలో వానాకాలం సీజన్‌లో సుమారు 4.5లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 3.35లక్షల ఎకరాల్లో పత్తి, 56,861 ఎకరాల్లో వరి, 30,430 ఎకరాల్లో కంది, మరో 22,395 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తారు. ఈ సీజన్‌లో 60,081 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ప్రభుత్వానికి ఇండెంట్ పంపించారు. ఇప్పటివరకు జిల్లాకు సుమారు 25వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరాఫరా చేసింది. గతంతో పోల్చితే జిల్లాకు పంపించాల్సిన యూరియాలో కోత విధించింది. దీంతో రైతులు ఆశించినస్థాయిలో బస్తాలు లభ్యం కావడంలేదు. జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తికి మాత్రమే వినియోగిస్తుండగా, మరో 20 రోజులు గడిస్తే వరినాట్ల ప్రక్రియ మొదలుకానుంది. పంటల కాలం పూర్తయ్యే వరకు వేయాల్సిన యూరియా మొత్తం ఒకేసారి కొనుగోలు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పొలాలకు దారి లేకపోవడం, భవిష్యత్తులో యూరియా బస్తాలు దొరుకుతాయో లేదో అనే అనుమానంతో మూడు దఫాలకు సరిపడా ఇప్పుడే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీంతో పీఏసీఎస్‌లకు, హాకా సెంటర్ల నుంచి బస్తాలు పంపిణీ చేస్తున్నా సరిపోవడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 7,500 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
వేరే బస్తాలు కొంటేనే..
ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో వేరే బస్తాలు కొనుగో లు చేస్తేనే.. యూరియా ఇస్తామని యజమానులు మెలిక పెడుతున్నారు. గంటమందు బస్తాలు, ఇతర సేంద్రియ ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారు. యూరియా బస్తాకు ప్రభుత్వం రూ.266 నిర్ణయించగా.. ప్రస్తుతం కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తూ స్టాక్ లేదని చెబుతున్నారు.
రైతుల అవసరాలకు సరిపడా అందని ఎరువు
కేంద్రాల వద్ద బారులుదీరుతున్న అన్నదాతలు
ఫర్టిలైజర్ వ్యాపారుల తీరుతోనూ ఇబ్బందులు
బారులుదీరుతున్న అన్నదాతలు
సరిపడా యూరియా బస్తాలు లభ్యం కాకపోవడంతో రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. కొన్ని మండలాల్లో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎకరానికి రెండు బస్తాల చొప్పున అందిస్తున్నారు. దీంతో అన్నదాతలు పీఏసీఎస్‌లు, హాకా కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. రెండు, మూడు రోజులు వేచిచూసినా కొంతమందికి ఒక్క బస్తా అందడం లేదు. రెబ్బెన మండలంలోని పీఏసీఎస్‌కు ఇప్పటివరకు కేవలం మూడు లారీ లోడ్‌ల యూరియా సరఫరా కాగా.. ప్రతీ రైతుకు కేవలం రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. పదుల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నవారికి కూడా రెండేసి మాత్రమే అందించారు. మొదటి రోజు బస్తాల పంపిణీ కోసం చీటీలు రాసి ఇవ్వగా.. రెండోరోజు గురువారం ఆలస్యంగా పీఏసీఎస్ కార్యాలయాన్ని తెరిచారు. అధికారుల తీరును తప్పుపడుతూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆసిఫాబాద్, కెరమెరి, కౌటాల తదితర మండలాల్లో సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందించారు.
ఆందోళన చెందొద్దు
జిల్లాలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దు. ప్రస్తుతం పంటలకు వేయాల్సిన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెలా ఎరువులు సరాఫరా అవుతూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దారి సౌకర్యం, ఇతరాత్ర కారణాలతో బస్తాలన్నీ ఒకేసారి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. గురువారం నాటికి జిల్లాలో 7500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి

యూరియా తిప్పలు!

యూరియా తిప్పలు!