
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం హమాలీ సంఘం నాయకులతో కలిసి సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లు అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆరోపించారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హమాలీ సంఘం మండల అధ్యక్షుడు సునీల్, నాయకులు ధర్మేందర్, సుధాకర్, లాలు, దలవత్, దిలీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.