
ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన
● ఏఎస్పీ చిత్తరంజన్
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు మండలంలోని తక్కళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గ్రామాల్లోని ప్రజలకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉన్నతస్థాయికి చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.