
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో శంకరమ్మకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ 4 నుంచి 6 నెలలుగా కార్మికులకు వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2023 జూలై, ఆగస్టులో 34 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మినిమమ్ బేసిక్ ప్రకారం రూ.19వేల వేతనం చెల్లించాలని అప్పటివరకు జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పంచాయతీ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రమేస్, దేవాజీ, వెంకటేష్, సుధాకర్,శంకర్, సునీల్, అన్నాజీ, ప్రవీణ్, రాజేశ్వరీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.