
పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి
కాగజ్‌నగర్‌రూరల్: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 210 పాఠశాలల్లో మాత్రమే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిందని, అందులోనూ నర్సరీ, ఎల్‌కేజీ లేకుండా కేవలం యూకేజీ ప్రారంభిస్తామని పేర్కొనడం సరికాదన్నారు. అలాగే ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఏఈవో, ప్రధానోపాధ్యాయ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో విద్యాభివృద్ధికి 15 శాతం నిధులు కేటాయించాలని, నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నా రు. గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్‌టైం, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాలను అందించాలని, గురుకుల ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించడంతో పాటు హెల్త్‌కార్డులు అందజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంపల్లి ఉషన్న, జిల్లా ఉపాధ్యక్షుడు హిందురావు, కోశాధికారి రమేశ్, జిల్లా కార్యదర్శులు హేమంత్ షిండే, రాజ్ కమలాకర్ రెడ్డి, మహిపాల్, మోహపత్‌రావు, సమ్మయ్య, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.