
ఆరోగ్య యోగా
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు మానసిక ప్రశాంతత కరువైంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో యువతను సైతం రోగాలు సైతం చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా సాధన కీలకంగా మారింది. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా యోగాసనాలు సాధన చేస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..
కౌటాలలో
యోగసనాలు వేస్తున్న విద్యార్థులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆయన తన పన్నెండో ఏటా నుంచి యోగాసనాలపై మక్కువ పెంచుకున్నారు. కఠిన సాధన చేస్తూ కష్టమైన ఆసనాలు సులువుగా చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అంతేకాక అనేక యోగా పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలు, పతకాలు కై వసం చేసుకున్నారు మండల కేంద్రానికి చెందిన యోగా శిక్షకుడు దినేశ్ పురి. కెరమెరి మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ పురి, సునంద దంపతుల్లో చిన్నకుమారుడు దినేష్ పురికి ఆటలపై ఆసక్తి ఉండేది. కెరమెరిలోనే 1 నుంచి 8 తరగతి వరకు చదువుకోగా, ఆదిలాబాద్‌లో 9, 10, హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగుళూరులోని ఎస్ వ్యాస యూనివర్సిటీలో యోగాపై శిక్షణ పొందారు. వివిధ ఆసనాలు సులువుగా వేయడం సాధన చేశారు. 2019లో సిద్దిపేటలో జరిగిన ఆరో తెలంగాణ స్టేట్ లెవల్ యోగా చాంపియన్‌షిప్ పోటీలు, బెంగళూరులో జరిగిన జాతీయ, అంతర్జాతీయ హిమాలయ యోగా ఒలంపియాడ్ పోటీల్లో పాల్గొని ప్రశంపత్రాలు అందుకున్నారు. అదే ఏడాది పలు దేశాలకు చెందిన యోగా నిపుణులతో బెంగుళూరులో జరిగిన ప్రపంచస్థాయిలో పోటీలకు హాజరయ్యారు. మొత్తం 90 మందితోపాటు పాల్గొని ప్రతిభ చూపారు. హైదరాబాద్‌లో అనేకమంది విద్యార్థులకు యోగా పాఠాలు నేర్పారు. 2024 డిసెంబర్ నుంచి ఆయుష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆయుష్మాన్ యోగా మందిర్‌లో విద్యార్థులు, స్థానికులకు యోగాపై శిక్షణ కల్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు సాధన చేయిస్తున్నారు. గత నెల 27 నుంచి ఈ నెల 20 వరకు కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆశ వర్కర్ల, ఏఎన్‌ఎంలు, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, పోలీసులు, విభిన్న వర్గాలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.
ఆసనాల్లో అద్భుత ప్రతిభ
శిక్షకుడిగా రాణిస్తున్న దినేశ్ పురి

ఆరోగ్య యోగా