
బరిలోకి దిగితే పతకమే..
రెబ్బెన: మండలంలోని గోలేటికి చెందిన పత్తెం నిహారిక యోగాలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. 3వ తరగతి చదువుతుండగానే యోగా సాధన ప్రారంభించి అతి చిన్న వయస్సులోనే పట్టు సాధించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి.. ఏ పోటీ అయినా బరిలోకి దిగిందంటే పతకం సాధించాల్సిందే. తల్లి వద్ద నుంచి యోగా సాధనలో ఓనమాలు నేర్చుకుని ఇప్పటివరకు మూడు జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. తల్లిదండ్రులు రాజు, అలేఖ్య తమ ఇద్దరు పిల్లలకు యోగా శిక్షణ అందించారు. చిన్న కుమార్తె నిహారిక ప్రధానంగా చక్రాసన, టిట్టిబాసన, కౌడింగ్య ఆసన, మిడిల్ స్పిట్ వంటి ఆసనాలు వేయడంలో దిట్ట. 2022లో మొదటిసారి గోలేటిలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో అండర్– 10 విభాగంలో నిహారిక బంగారు పతకం సాధించింది. ఔరంగబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా చాంపియన్‌షిప్, బెల్లంపల్లిలో నిర్వహించిన 34వ ఇండియా న్యూ ట్రెడిషనల్ యోగా నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ బంగారు పతకం సాధించింది.