
సీహెచ్‌పీలో సమస్యలు పరిష్కరించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి సీహెచ్‌పీలో నెలకొన్న సమస్యలు యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సంగెం ప్రకాశ్‌రావు అన్నారు. గోలేటి సీహెచ్‌పీలో ఐఎన్‌టీయూసీ నాయకులు శుక్రవారం పర్యటించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌పీలో ఆర్వో ప్లాంటు చెడిపోవడంతో కార్మికులకు శుద్ధం జలం అందడం లేదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. మోటర్ వెహికల్ డ్రైవర్లు సరిపడా లేకపోవడంతో ఫస్ట్ షిఫ్ట్‌లో ఒకే డ్రైవర్‌తో లోడర్, క్రేన్ నడిపిస్తున్నారని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులు విధులకు గైర్హాజరు అయితే.. పెనాల్టీ విధించే పద్ధతిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మ్యాన్ పవర్‌కు తగినట్లుగా ప్లేడేలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు సదాశివ్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గట్టయ్య, నాయకులు కొవ్వూరి శ్రీకాంత్, శ్యాంబాబు, రాజయ్య, అర్జయ్య పాల్గొన్నారు.