
ఆగని వేట
● అడవుల నుంచి మైదాన ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ● వేటగాళ్ల తీగలకు బలి ● కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు ● అడ్టుకట్ట వేయలేక పోతున్న అటవీశాఖ
పెంచికల్‌పేట్: జిల్లాలో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు. అటవీశాఖ అధికారుల నిఘా వైఫల్యంతో నిత్యం ఎక్కడో ఒకచోట అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ తీగలకు బలవుతున్నాయి. రాత్రి వేళల్లో అటవీ సమీప ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చి యధేచ్ఛగా దుప్పులు, జింకలు, మెకాలు, కొండగొర్రెలు వంటి వన్యప్రాణులను హతమారుస్తున్నారు. వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ వేటనే వృత్తిగా మార్చుకున్నారు. అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం పెద్దపులిని హతమార్చిన వేటగాళ్లు చర్మం, గోర్లు, దంతాలను ఎత్తుకెళ్లారు.
అటవీ సమీప ప్రాంతాల్లో నిత్యం వేట...
జిల్లాలో విస్తృతమైన అటవీ సంపదతో పాటు సహ జ నీటి వనరులు, నిరంతరం ప్రవహించే పెద్దవా గు, ప్రాణహిత నదులు ఉన్నాయి. దీంతో అనేక రకాల వన్యప్రాణులు ఆవాసంగా మార్చుకుని జీవ నం సాగిస్తున్నాయి. రెండు నెలలుగా అటవీ ప్రాంతంలోని సహజ నీటి వనరులు ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణులు ఆహారం, నీటి కొరకు మైదా న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇదే అదనుగా భావి స్తున్న వేటగాళ్లు వాటిని హతమారుస్తున్నారు. మారుమూల గ్రామాల్లో జరిగే సంఘటనలు గ్రామస్తుల సహకారంతో బయటికి వస్తే అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
అటవీశాఖ అధికారుల అదుపులో నిందితులు?
ఎల్లూర్ అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో పెద్దపులిని హతమార్చిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిచ్చి న సమాచారంతో అటవీశాఖ అధికారులు పులి చ ర్మం, దంతాల కొరకు ఆదివారం ప్రత్యేక బృందా లు సెర్చ్ ఆపరేషన్ చేశారు. పెంచికల్‌పేట్ శివారులోని పంట పొలాలు, ఎల్లూర్ అటవీ ప్రాంతంలో అధికారులు గాలించారు. కొత్తగూడ గ్రామానికి చెందిన పలువురు అనుమానితులను శనివారం అదుపులోకి తీసుకోగా వారిలో ఏడుగురిని విచారించిన అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎ ల్లూర్ గ్రామానికి చెందిన ముగ్గురు, పెంచికల్‌పేట్ గ్రామానికి చెందిన ముగ్గురు, అగర్‌గూడ గ్రామాని కి చెందిన ఇద్దరితో పాటు దహెగాం మండలంలోని రాస్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురిని అటవీశాఖ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
విద్యుత్ తీగలతోనే వేట...
డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, బెజ్జూర్, కర్జెల్లి, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో నిత్యం వే ట సాగుతుంది. అటవీ ప్రాంతాల నుంచి వె ళ్తున్న విద్యుత్ తీగలకు బైండింగ్ వైర్లను తగి లించి కిలోమీటరు వరకు కంచెగా ఏర్పాటు చేసి వన్యప్రాణులను హతమారుస్తున్నారు. పెంచికల్‌పేట్ రేంజ్‌లోని మెరెగూడ, ఎల్లూర్, కోయచిచ్చాల, అగర్‌గూడ, లోడుపల్లి, కొండపల్లి ప్రాంతాల్లో సైతం విద్యుత్ తీగలు అటవీ ప్రాంతాల సమీపంలో ఉండటం వేటగాళ్లకు అదునుగా మారింది.
అనుమానితులను విచారిస్తున్న అధికారులు?
దహెగాం: పెంచికల్‌పేట మండలంలోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి పులి మృతి చెందడంతో ఒడ్డుగూడ, కర్జి, బామానగర్, చినరాస్పెల్లితో పాటు పలు గ్రామాలకు చెందిన పలువురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చెందిన ఓ డ్రైవర్ ఇంట్లో సైతం అధికారులు సోదాలు నిర్వహించారు. అతన్ని అదుపులో తీసుకుని చినరాస్పెల్లి ప్లాంటేషన్ వద్ద వదిలేశారు. కాగా అతని సెల్‌ఫోన్ తీసుకెళ్లినట్లు తెలిసింది.