
కష్టానికి ప్రతిఫలం
● జిల్లాలో మొదలైన ఆయిల్‌పామ్ పంట దిగుబడి ● వచ్చే నెల నుంచి గెలల కత్తిరింపు పనులు ప్రారంభం ● 1,320 ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం
రెబ్బెన(ఆసిఫాబాద్): సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి.. కొత్తరకం పంటల సాగు ప్రారంభించిన జిల్లా రైతులు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రయోగాత్మకంగా పండించిన ఆయిల్‌పామ్ దిగుబడి మరికొన్ని రోజుల్లో అందనుంది. నాలుగేళ్లుగా చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అన్నదాతకు ప్రతిఫలం దక్కనుంది. జిల్లాలో నాలుగేళ్ల క్రితం ఆయిల్‌పామ్ సాగుకు అ డుగుపడింది. ప్రారంభంలో అతికొద్ది మంది మా త్రమే తోటల సాగుపై ఆసక్తి చూపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా తోటల సాగు చేపట్టగా.. అవి ఈ ఏడా ది నుంచి రైతులకు దిగుబడితోపాటు ఆదాయాన్ని అందించనున్నాయి. జూన్ నుంచి ఆయిల్‌పామ్ గె లలు కోసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
53 ఎకరాలతో మొదలై..
నాలుగేళ్ల క్రితం జిల్లా రైతులు ఆయిల్‌పామ్ తోటల సాగు ప్రారంభించారు. ఈ తరహా సాగుపై అవగాహన లేకపోవడం, సమీపంలోని జిల్లాలోనూ పంట లేకపోవడంతో స్థానిక రైతులు ప్రారంభంలో ఆసక్తి చూపలేదు. ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆయిల్‌పామ్ తోటల సాగుతో వచ్చే ఆదాయం వివరాలను వివరిస్తూ ప్రోత్సహించారు. దీంతో రెబ్బెన, చింతలమానెపల్లి, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్ మండలాలకు చెందిన కొంతమంది ముందుకొచ్చారు. 53 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఆయిల్‌పామ్ సాగు ప్రారంభించారు. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నాలుగేళ్ల క్రితం అతితక్కువ విస్తీర్ణంలో మొదలైన పంట సాగు ఇప్పుడు 1,320 ఎకరాలకు చేరింది. మొదటి మూడేళ్లు మొక్కల నిర్వహణతోపాటు అంతర పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు సైతం అందించింది. అయితే సాగు విస్తీర్ణం పెరుగుతున్నా అధికారులు లక్ష్యానికి అనుగుణంగా విస్తీర్ణం పెరగడం లేదు. ఇప్పటికీ కొంతమంది రైతులకు కొన్ని అపోహలు ఉండడం, సరైన నీటి వసతులు లేకపోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.
కొద్దిరోజుల్లో మొదటి దిగుబడి
జిల్లాలో నాలుగేళ్ల క్రితం నాటిన ఆయిల్‌పామ్ చెట్లు మరికొన్ని రోజుల్లో మొదటి దిగుబడిని అందించనున్నాయి. మొదటి ఏడాది ఎకరానికి సుమారు 2 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చెట్టు ఆరేళ్ల వయస్సుకు వచ్చేసరికి ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రైతు ఒక్కసారి చెట్లు నాటితే 35 ఏళ్ల పాటు సంవత్సరం పొడవునా దిగుబడి ఇస్తూనే ఉంటాయి. సంప్రదాయ పంటల సాగుతో పోల్చితే ఆయిల్‌పామ్‌తో రైతులు లాభాలు ఉంటాయి.
– ఎంఏ నదీం, ఉద్యానవన శాఖ అధికారి
ఎకరానికి రెండు టన్నుల దిగుబడి..
గతేడాదే చెట్లు కాత దశకు చేరినా అంతంత మాత్రంగానే వచ్చే కాపుతో రైతులకు ప్రయోజనం ఉండదు. గత సంవత్సరం వచ్చిన గెలలను కత్తిరించి పడేశారు. ఈ ఏడాది నుంచి వచ్చే గెలలతో రైతులకు ఆదాయం వస్తుంది. జూన్‌లో కత్తిరింపు పనులు మొదలుకాగానే రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మ్యాట్రిక్స్ సంస్థ గెలలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తుంది. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు సుమారు 4 నుంచి 6 వరకు గెలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం ఎకరానికి సుమారు రెండు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్నా క్రమంగా పెరగనుంది. సకాలంలో యాజమాన్య పద్ధతులు చేపడితే ఆయిల్‌పామ్ చెట్లు 6 నుంచి 7 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఎకరానికి 8 నుంచి 12 టన్నుల దిగుబడి అందిస్తాయి. అగ్రిమెంట్ ప్రకారం మ్యాట్రిక్స్ కంపెనీ కొనుగోలు చేసే రోజుకు ఉన్న మార్కెట్ ధరను రైతులకు చెల్లిస్తుంది. దీంతో దిగుబడులు అమ్ముకోవడంలో ఇబ్బందులేవీ ఉండవు. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ ధర రూ.20,800 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగో సంవత్సరం నుంచి 30 ఏళ్లపాటు రైతులకు దిగుబడిని అందిస్తూనే ఉంటాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్లపాటు రైతు ఆదాయాన్ని పొందుతూనే ఉండవచ్చు.

కష్టానికి ప్రతిఫలం

కష్టానికి ప్రతిఫలం