
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ
దహెగాం(సిర్పూర్): మండల కేంద్రంతోపాటు లగ్గాం, కుంచవెల్లి, గిరవెల్లి, కల్వాడ, చంద్రపల్లి, ఒడ్డుగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. 17శాతం కంటే తక్కువ తేమ ఉంటే వేగంగా కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యంపై కప్పడానికి వీలుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఆయన వెంట డీఏవో శ్రీనివాసరావు, డీసీవో బిక్కు, డీటీలు లలిత, రాజ్‌కుమార్, శ్రీనివాస్, ఏవో రామకృష్ణ, ఏఈవోలు తదితరులు ఉన్నారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండలంలోని నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. నారాయణపూర్ కేంద్రం నిర్వాహకులు ధాన్యం తేమను పరిశీలించడంలో జాప్యం చేస్తున్నారని, గోనె సంచులు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మరుసటిరోజే అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యంలో తేమ శాతం పరిశీలించి, సకాలంలో గోనె సంచులు అందించాలని ఆదేశించారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఏపీఎం వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.