కేఎంసీ బడ్జెట్‌.. రూ.188.31కోట్లు | - | Sakshi
Sakshi News home page

కేఎంసీ బడ్జెట్‌.. రూ.188.31కోట్లు

Mar 26 2025 1:11 AM | Updated on Mar 26 2025 1:09 AM

● సొంత నిధులతో పాటు ప్రభుత్వ నిధులపై ఆశలు ● అన్ని డివిజన్లలో రీ–అసెస్‌మెంట్‌ సర్వేకు నిర్ణయం ● కౌన్సిల్‌ భేటీలో పాల్గొన్న మేయర్‌ నీరజ, కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ● సమస్యలపై కార్పొరేటర్లు.. ప్రొటోకాల్‌పై ఎమ్మెల్సీ మధు ప్రస్తావన

ఖమ్మంమయూరిసెంటర్‌: రానున్న ఆర్థిక సంవత్సరానికి ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం భారీ బడ్జెట్‌ రూపొందించింది. రూ.188.31 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌పై చర్చ, ఆమోదానికి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ పునుకొల్లు నీరజ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ పాల్గొనగా... 2025–2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలు, ఆదాయం, వ్యయం వివరా లే కాక 2024–2025 సవరించిన బడ్జెట్‌ను అకౌంట్స్‌ అధికారి శివలింగం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆదాయానికి తోడు సొంతనిధులు కలిపి భారీ బడ్జెట్‌ సమర్పించినట్లు పాలకవర్గం వెల్లడించింది.

ప్రాథమిక లెక్కలపై లోతుగా చర్చ

కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ బడ్జెట్‌ ప్రాథమిక లెక్కలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడమే కాక ఆస్తి పన్ను, ఇతర పన్నుల రీఅసెస్‌మెంట్‌తో ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అర్బన్‌కు ప్రత్యేకంగా ఇద్దరు తహసీల్దార్లు, ముగ్గురు సర్వేయర్ల కేటాయింపునకు నెలలోగా ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని తెలిపారు. అలాగే, దూరదృష్టితో మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని వెల్లడించారు.

విలీన పంచాయతీలపై దృష్టి..

మేయర్‌ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ విలీన పంచాయతీల అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో బడ్జెట్‌ కేటాయించామని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీలు లేనిచోటే నిర్మాణాలు జరుగుతాయన్నారు. వచ్చే నెల మొదటి వారం మరోసారి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి కార్పొరేటర్ల నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు.

ఆదాయం పెంపుపై దృష్టి..

కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య మాట్లాడుతూ కార్పొరేషన్‌ ఆదాయం పెంచాలనే లక్ష్యంతో 43వ డివిజన్‌లో పన్నుల రీఅసెస్‌మెంట్‌ చేయగా రూ.60లక్షల మేర ఆదాయం పెరిగిందని తెలిపారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం అన్ని డివిజన్లలో ఈ ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. నగరంలో 7వేల వాణిజ్య సంస్థలే రిజిస్టర్‌ కాగా.. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈమేరకు వ్యాపారులంతా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకునేలా సర్వే చేస్తామని తెలిపారు. అలాగే, కేఎంసీని ఐదు జోన్లుగా విభజించే ప్రణాళికను వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెడతామని వెల్లడించారు.

ప్రొటోకాల్‌ రగడ

కేఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరవుతున్నానని తెలిపినా అధికారులు సీటు కేటాయించలేదని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్సీకి ప్రత్యేక సీటు కేటాయించి నేమ్‌ బోర్డు ఏర్పాటుచేసినా.. తొలుత వచ్చిన కార్పొరేటర్లు ఆ బోర్డును పక్కన పెట్టడం ఈ వివాదానికి కారణమైంది.

●కార్పొరేటర్‌ కమర్తపు మురళి మాట్లాడుతూ గ్రౌండ్‌ ఫ్లోర్‌కు అనుమతి తీసుకొని మూడు, నాలుగు ఫ్లోర్లు నిర్మిస్తున్న వారిని గుర్తించి ఆస్తి పన్ను వసూలు చేయాలని సూచించారు. అద్దెల కింద ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని, అనుమతులు లేకుండా ఇళ్లను గుర్తించి పన్నులు విధించాలని తెలిపారు.

●పలువురు కార్మికులను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిగా గుర్తించాలని కార్పొరేటర్‌ బీ.జీ.క్లెమెంట్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. తన డివిజన్‌లో పలు రోడ్ల విస్తరణ, అభివృద్ధి ఆవశ్యతను వివరించారు.

●కార్పొరేటర్‌ నాగండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ కేటాయించిన బడ్జెట్‌ఖర్చు చేయనందున ఆ నిధులు ఏమి చేస్తున్నారో చెప్పాలన్నారు. అంతేకాక విలీన గ్రామాలకు మరిన్ని నిధులు కేటాయించి రహదారులు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.

ఆదాయం ఇలా.. కోట్లు (రూ.ల్లో)

ఇంటి పన్నులు 33.92

స్టాంప్‌ డ్యూటీ 13.00

అద్దెల ద్వారా 4.43

పారిశుద్ధ్య విభాగం 3.61

ప్రణాళిక విభాగం 36.10

ఇంజనీరింగ్‌ విభాగం 11.76

డిపాజిట్లు 6.76

ప్రణాళికేతర నిధులు 61.05

ప్రణాళిక నిధులు 14.75

ఇతర నిధులు 2.92

కేఎంసీ బడ్జెట్‌.. రూ.188.31కోట్లు1
1/2

కేఎంసీ బడ్జెట్‌.. రూ.188.31కోట్లు

కేఎంసీ బడ్జెట్‌.. రూ.188.31కోట్లు2
2/2

కేఎంసీ బడ్జెట్‌.. రూ.188.31కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement