
ఆలయం ఆరంభం
మాలూరు: తాలూకాలోని అంచెముస్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ దేవి దేవాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామంలో భక్తులు, ప్రజల సహకారంతో శ్రీ గంగమ్మ దేవి దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. వేదమంత్ర పారాయణం, కళశ స్థాపన, మహా కుంభాభిషేకం తదితరాలను నెరవేర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనాలు చేసుకున్నారు.
ఘరానా రైలు దొంగ అరెస్టు
మైసూరు: రైలులో దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర దొంగను మైసూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన జితేంద్రకుమార్ చమ్లా (37) అరెస్టయిన నిందితుడు. ఇతని నుంచి రూ. 22.75 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకొన్నారు. రైళ్లలో 17 చోరీల కేసులు పరిష్కారమయ్యాయి. మంగళూరు, అరసికరే రైల్వేపోలీస్ స్టేషన్‌లలో 4 కేసులు ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక లో రైళ్లలో ప్రయాణిస్తూ డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లాడని కేసులున్నాయి. పలుసార్లు అరెస్టయి విడుదలైనా మళ్లీ దొంగతనాలే చేసేవాడు. రైల్వే ఎస్పీ శ్యామలత ఆధ్వర్యంలో గాలింపు జరిపి పట్టుకున్నారు.
యథేచ్ఛగా జింకల వేట
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలో ఆనేకల్ తాలుకాలో ఉన్న బన్నేరుఘట్ట అభయారణ్యంలో జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని, కొమ్ములను అమ్ముతున్న ముఠాని అటవీ అధికారులు గుర్తించారు. 74 కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. నైస్ రోడ్డు జంక్షన్ వద్ద ఓ కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. కారు డ్రైవర్ ప్రతాప్ (31)ని అరెస్టు చేసి ప్రశ్నించి సీకే పాళ్యలో ఉన్న ఒక షెడ్‌లో గాలించగా మరింత మాంసం, చర్మాలు లభించాయి. ఒక సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్ తుపాకీలు, పదితూటాలు, రెండు కార్లు, ఒక బైక్, తూకం యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలరాజు, షెడ్ యజమాని భీమప్ప, రమేష్, ఫిలిప్‌లపై కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నారు. అభయారణ్యంలో చుక్కల జింకలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని వేటాడి మాంసాన్ని అమ్మేవారని తెలిపారు.
సహజీవనంలో హత్య
● అసోంవాసి అరెస్టు
బనశంకరి: బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు స్కేటింగ్ గ్రౌండ్ వద్ద బీబీఎంపీ చెత్త లారీలో లభించిన మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమైంది. సహజీవనంలో ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. అసోంకు చెందిన షంషుద్దీన్ (33) అనే వలస కూలీని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఇద్దరు పిల్లల తల్లి అయిన పుష్ప అలియాస్ ఆశ (40) హత్యకు గురైన మహిళ. భార్య పిల్లలను అసోంలోనే వదలిపెట్టిన నిందితుడు హుళిమావు వద్ద ఓ హౌస్ కీపింగ్ సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే స్థానికురాలు వితంతువు పుష్పా పనిచేస్తూ ఇద్దరి మధ్య పరిచయమై ఏడాదిన్నర నుంచి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. పుష్ప ఫోన్లో ఎక్కువగా మాట్లాడడంతో అనుమానంతో షంషుద్దీన్ వేధిస్తున్నాడు. జూన్ 28వ తేదీ రాత్రి గొడవ జరిగి, నిందితుడు కత్తితో దాడి చేసి, ఆపై గొంతు పిసికి పుష్పని హత్య చేశాడు. మృతదేహాన్ని మూటగట్టి బైకులో పెట్టుకుని హుళిమావు నుంచి వచ్చి చెత్త లారీలో పడేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం చెత్త లారీలో మృతదేహం కనిపించడంతో స్థానికులు భయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి హంతుకుని కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు.

ఆలయం ఆరంభం

ఆలయం ఆరంభం