
కెంపేగౌడ దూరదృష్టి కలిగిన నేత
శివాజీనగర: బెంగళూరును అభివృద్ధి పరిచే కలను నెరవేర్చే పనిని తమ ప్రభుత్వం చేయనుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం నాడప్రభు కెంపేగౌడ 516వ జయంతిని పురస్కరించుకొని బెంగళూరు విధానసౌధ తూర్పు దిక్కున ఉన్న ఆయన ప్రతిమకు పూలమాలను సమర్పించిన తరువాత కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. బెంగళూరు అభివృద్ధికి పలు పథకాలను అమలుపరిచి ఆ కలను నెరవేరుస్తామన్నారు. కెంపేగౌడ దూరదృష్టి కలిగిన పరిపాలకుడు, ఆధునిక బెంగళూరు నిర్మాత అని తెలిపారు. కెంపేగౌడ జయంతిని ప్రభుత్వం, కెంపేగౌడ అభివృద్ధి ప్రాధికార, బీబీఎంపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆచరించారు. 2013–18వ కాలావధిలో తమ ప్రభుత్వం నిర్మలానందస్వామితో చర్చలు జరిపి జన్మతేదీని తెలుసుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కెంపేగౌడ జయంతిని ఆచరిస్తోందన్నారు. బెంగళూరు నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందంటే పునాది వేసింది కెంపేగౌడ అన్నారు. ఆయనను ప్రభుత్వం స్మరించిందన్నారు. బెంగళూరులోని నాలుగు భాగాల్లో గోపురాలను నిర్మించిన కెంపేగౌడ ఆరోజే బెంగళూరు పరిపాలన ఇలా ఉండాలని తెలుసుకొని వృత్తి ఆధారంగా నగరత్ పేట, చిక్కపేట, బళెపేటతో పాటు అనేక పేటలను తమ పాలనావధిలో నిర్మించారు. ఆయన పాలన తమకందరికీ కూడా ఆదర్శం అని తెలిపారు. సుమనహళ్లి జగ్జీవన్‌రాం నగరలో కెంపేగౌడ జయంతిని ఆచరించారు.
కెంపేగౌడ భవనానికి శంకుస్థాపన:
సుమనహళ్లి సర్కిల్‌లో కెంపేగౌడ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. భారతీయ విజ్ఞాన సంస్థకు చెందిన కౌశల్ వర్మ, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాధికార మేనేజింగ్ డైరెక్టర్ హరి మరార్, మైసూరు స్యాండల్ సోప్ సంస్థ ఎండీ ప్రశాంత్ పీ.కే.ఎంకు అవార్డు ప్రదానం చేశారు. విమానాశ్రయం వద్ద కెంపేగౌడ ప్రతిమకు డిప్యూటీ సీఎం శివకుమార్ నివాళులర్పించారు. కెంపేగౌడ ఎంతో దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు.
బెంగళూరు అభివృద్ధికి కంకణం
జయంతి వేడుకల్లో సీఎం సిద్దరామయ్య

కెంపేగౌడ దూరదృష్టి కలిగిన నేత