
విభిన్న పంటల సాగులో దిట్ట ముత్తణ్ణ
హుబ్లీ: వైవిధ్యమయమైన సాగుకు హావేరిలోని కామనహళ్లి రైతు ముత్తణ్ణ ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. స్కూల్ మెట్లు ఎక్కని రైతు ముత్తణ్ణ బీరప్ప పూజార అన్ని విద్యల కన్నా వ్యవసాయం మిన్న అని నిరూపించారు. ఆయనకు రాజ్యోత్సవ అవార్డు కూడా లభించింది. అంతేగాక ధర్మస్థల సాగు మేళా, జిల్లా మేళాతో పాటు వివిధ మేళాల్లో పలు అవార్డులను ముత్తణ్ణ స్వీకరించారు. ఆయన స్వగ్రామం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలోని నవిలెహాళ. రెండు దశాబ్దాల క్రితం ఆయన తల్లిదండ్రులతో కలిసి గొర్రెలను పెంచుకుంటూ హావేరికి వచ్చారు. ఆయనతో పాటు ఉన్న 2500 గొర్రెలు, మేకల్లో రోగాల బాధతో 1000కి పైగా మరణించాయి. దీంతో గొర్రెల పెంపకానికి స్వస్తి చెప్పిన ముత్తణ్ణ తల్లిదండ్రుల సహాయంతో కామనహళ్లిలో సుమారు 10 ఎకరాల పొలంలో సాగు బాట పట్టారు. అయితే ఆ పొలం వట్టిపోయినందున గ్రామస్తులు ఎద్దేవా చేసేవారు. అయినా మొక్కవోని దీక్షతో ముత్తణ్ణ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సహాయ సహకారాలతో ఆ 10 ఎకరాల పొలంలో వివిధ పంటలు సాగు చేశారు. అలాగే వక్క నర్సరీని ప్రారంభించారు.
ఇక అప్పట్నుంచి తిరుగు లేదు
ఇక అప్పటి నుంచి ముత్తణ్ణకు తిరుగు లేకుండా పోయింది. ప్రారంభంలో వేలాది వక్క మొక్కలను అమ్ముతున్న ఈయన ఈ ఏడాది మూడు లక్షల వక్క మొక్కలతో పాటు మామిడి, కొబ్బరి మొక్కలను విక్రయించాడు. ప్రస్తుతం ముత్తణ్ణ వద్ద 37 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొబ్బరి, అరటి, వక్క, సపోటా, మామిడి తదితర వైవిధ్యమైన సాగు చేస్తున్నారు. అంతేగాక పాడిపరిశ్రమ, చేపల పెంపకం, తేనెటీగల సాగు, అజోళతో పాటు సేంద్రియ సాగు పద్ధతులతో జిల్లాలోని అందరి రైతులకు స్పూర్తినిస్తున్నారు. సుమారు 24 రకాల వరిని పండిస్తున్నారు. అవన్ని కూడా జేసీ వంగడాలు కావడం విశేషం. ఆయన పండించిన వరి కొనుగోలుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నాయి. ప్రారంభంలో ఎకరాకు 20 క్వింటాళ్ల వరి పండిస్తున్న ముత్తణ్ణ అత్యాధునిక సాగు పద్ధతులతో ఒక్కో సారి ఎకరాకు 48 క్వింటాళ్ల వరి పండించిన ఉదాహరణలు ఉన్నాయి. 37 ఎకరాల భూమిలో 15 బోరు బావులు ఉన్నాయి. ఆయన పొలానికి మొత్తం మూడు టీసీలు ఉన్నాయి.
పైపు లైన్ ద్వారా జల ఎరువు సరఫరా
ఇంట్లో జైవిక బయోట్యాంక్ నిర్మించి ఇక్కడి నుంచి లభించే సేంద్రియ జల ఎరువును తోటలకు పైపు లైన్ ద్వారా సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఆయన తోటలో రాత్రి సమయాల్లో సంగీతం వినిపించడం సాగుకు ప్రత్యేకతగా చెబుతున్నారు. పగలు మనం తోటలో సంచరిస్తాం. పశువులు, పక్షులు, పని మనుషులు కూడా ఉంటాయి. దీంతో వృక్షాలకు ఎటువంటి ఒంటరితనం అనుభవంలోకి రాదు. అయితే రాత్రి వేళ ఎటువంటి శబ్దాలు ఉండవు. ఈ సమయంలో శాసీ్త్రయ సంగీతం, వైవిధ్యమయ సంగీత పరికరాలతో ధ్వని సురళి వేయడం ద్వారా పాటలు వినిపిస్తాయి. వీటికి చెట్లు చేమలు స్పందిస్తాయి. ఫలితంగా ఎక్కువ దిగుబడి వస్తుంది. సంగీతానికి ఆ శక్తి ఉందని ముత్తణ్ణ సంతోషంగా చెబుతారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా ఆయన తోటకు అన్నదాతలు విచ్చేసి కొత్త ప్రయోగాల గురించి వివరాలు తెలుసుకుంటారు. ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ముత్తణ్ణ ఈ అవార్డుతో నా బాధ్యత మరింతగా పెరిగింది. ఇదంతా నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వ్యవసాయ అధికారులకు, తోటి రైతులకు చెందుతుందని ఆయన తెలిపారు.
24 రకాల వరితో మేలైన దిగుబడి
రాత్రి వేళ పొలంలో సంగీత శ్రావ్యం

విభిన్న పంటల సాగులో దిట్ట ముత్తణ్ణ

విభిన్న పంటల సాగులో దిట్ట ముత్తణ్ణ

విభిన్న పంటల సాగులో దిట్ట ముత్తణ్ణ