
కనుల భాగ్యం.. పల్లకీ వైభోగం
బనశంకరి: వైవిధ్య పుష్పరాశులతో తయారైన పూల పల్లకీలు, అందులో కొలువుతీరిన దేవీ దేవతలను చూడడానికి భక్తులకు రెండు కళ్లు చాలలేదు. సిలికాన్ సిటీలో గ్రామదేవతల పూల పల్లకీ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించారు. 28 కి పైగా గ్రామ దేవతల పూల పల్లకీ వాహనాల్ని రమణీయంగా ఊరేగించారు. పల్లకీల్లో ఆసీనులైన గ్రామదేవతలను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. మహదేవపుర నియోజకవర్గంలోని గరుడాచార్‌పాళ్యలో ఊరహబ్బ– ఊరు పండుగ శనివారం రాత్రి వైభవంగా ఆరంభమైంది. నిత్యం కొలిచే గ్రామ దేవతలను అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బృహత్ పూల పల్లకీ వాహనాలలో ప్రతిష్టించారు. ఇందుకోసం ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలను వినియోగించారు.
అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు
కళా బృందాల ప్రదర్శనలు, మంగళవాయిద్యాలతో కోలాహలం మిన్నంటింది. అర్ధరాత్రి బృహత్ ఊరేగింపు ఆరంభమైంది. వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, చాముండేశ్వరీదేవి, గట్టి గణపతి, కావేరమ్మ, మద్దూరమ్మ, షిరిడి సాయి, అయ్యప్పస్వామి తదితర దేవీదేవతల పూలపల్లకీలు భక్తులను పరవశింపజేశాయి. చాముండేశ్వరీదేవి పూల పల్లకీని క్రేను మోస్తూ కదిలింది. పల్లకీలను భక్తులు మొబైల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం వరకు గరుడాచార్‌పాళ్య వీధుల్లో గ్రామ దేవతలను ఊరేగింపుతో ఉత్సవ శోభ నెలకొంది. మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ గ్రామదేవతలను పూజలు చేశారు. ప్రవాసాంధ్రులు పూల పల్లకీలను దర్శించుకున్నారు.
మహదేవపురలో నేత్రపర్వంగా
గ్రామ దేవతల జాతర

కనుల భాగ్యం.. పల్లకీ వైభోగం