
తుంగభద్ర పూడిక తొలగింపు కష్టసాధ్యం
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో పేరుకు పోయిన పూడికను తొలగించడం కష్టసాధ్యం. అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈనెల 20న జరుగనున్న సాధన సమావేశం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లు, వేదికను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర జలాయంలో పూడికతో వృథా అవుతున్న నీటిని తిరిగి పొందేందుకు ప్రత్యామ్నాయంగా నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 25 టీఎంసీల వరకు నీటి సరఫరాకు సంబంధించి ఒక ప్రతిపాదన ఉందన్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో దీనిపై చర్చిస్తామన్నారు. నీటిపారుదల శాఖ నుంచి కూడా తమకు ప్రతిపాదన అందిందన్నారు. దానికి ఎటువంటి కాల పరిమితి లేదని ఆయన స్పష్టం చేశారు. తుంగభద్ర జలాశయం గేట్ల మరమ్మతులు కూడా చేస్తామన్నారు. దీని కోసం ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గేట్ల మార్పునకు నిధుల కొరత లేదన్నారు. దీనిపై మూడు రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. 2023 మే 13న రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించి అధికారం అప్పగించారన్నారు. ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో ఉండటంతో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 138కి పెరిగిందన్నారు.
కేంద్రంలో బీజేపీ ఉన్నా రాష్ట్రంలో మేమే
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఓటు వేశారన్నారు. తమ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తి కావడంతో తాము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామన్నారు. ఈ నెల 20న హొసపేటెలో జరుగునున్న సాధన సమావేశం సందర్భంగా రాష్ట్రంలో లక్ష మందికి పైగా పేద ప్రజలకు హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. చాలా ఏళ్లుగా రెవెన్యూ శాఖ పరిధిలోకి రాని తండాలను, హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా మారుస్తామన్నారు. అదే విధంగా నివాసులకు పట్టాలకు అందిస్తామన్నారు. ఈ సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారన్నారు. సమావేశానికి బీజేపీ, జేడీఎస్ పార్టీల వారిని కూడా ఆహ్వానించామన్నారు. మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, శివరాజ్ తంగడిగి, చెలువరాయస్వామి, హెచ్‌కే పాటిల్, బైరేగౌడ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు.
20న హొసపేటెలో సాధన సమావేశం
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడి