
గ్రేటర్ బెంగళూరుకు శ్రీకారం
శివాజీనగర: సిలికాన్ సిటీ, గార్డెన్ సిటీ, ఐటీ హబ్ ఇలా పలు విధాలుగా పేరు ప్రఖ్యాతులున్న బెంగళూరు నగరానికి గ్రేటర్ అనే కిరీటం సిద్ధమైంది. విశాలమైన నగరంలో పరిపాలన, సౌలభ్యాలను కల్పించడం కోసం ఇది అవసరమని సర్కారు చెబుతోంది. గురువారం నుంచి గ్రేటర్ బెంగళూరు చట్టం అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, నేటి నుంచి గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అమల్లోకి వచ్చింది. ఇకపై బీబీఎంపీ అనేది ఉండదు, జీబీఏ అవుతుంది. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రాధికారకు తాను అధ్యక్షునిగా ఉంటానని తెలిపారు.
3 కార్పొరేషన్లుగా విభజన?
ప్రస్తుతమున్న బీబీఎంపీని 3 భాగాలుగా విభజించే అవకాశముంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర కార్పొరేషన్లుగా విడగొట్టనున్నారు. ప్రతి పాలికెలో 125 వార్డులు ఉంటాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నగరంలో అనేక పాలనాపర మార్పులు రాబోతున్నాయి. ప్రజలకు కొన్ని మార్పులు సౌకర్యంగా, కొన్ని భారంగా ఉండే అవకాశముంది. గ్రేటర్ బెంగళూరు ప్రాధికారను 120 రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో పాలికెకు సరిహద్దులు, అధికారాలు నిర్ణయించవలసి ఉంది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి గా ఉన్న డీకే శివకుమార్ ఈ ప్రాధికారకు ఉపాధ్యక్షునిగా ఉంటారు. ప్రాధికార పరిపాలన ఎలా ఉంటుందోనన్న కుతూహలం ప్రజల్లోను, ప్రభుత్వంలోను నెలకొంది.
సీఎం సిద్దరామయ్య వెల్లడి
బీబీఎంపీ స్థానంలో జీబీఏ