జోష్ పెరిగేనా?
కరీంనగర్ ఎవరిది..?
ముఖ్యమంత్రి హుస్నాబాద్ సభపై గంపెడాశలు
ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు కురుస్తుందని ధీమా
పాతజిల్లాలో పార్టీ పటిష్టతపై క్యాడర్ ఆశలు
స్థానిక సంస్థలలో మెజారిటీ స్థానాలపై కన్ను
ముగ్గురు మంత్రుల సఖ్యతపై ఆసక్తి
హస్తంలో
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
‘పల్లెల్లో’ పాగా వేసేందుకు ‘పట్టణం’లో పెట్టిన సీఎం సభపై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీస్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌లో జరిగే సీఎంసభను ప్రచార అస్త్రంగా భావిస్తున్నారు. పల్లెలను ప్రభావితం చేసేలా పెడుతున్న పట్టణ సభద్వారా మరింత జోష్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా మంత్రుల నడుమ ఆధిపత్యపోరు, కరీంనగర్ కేంద్రంగా పార్టీ అనాథలా మారడం, నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్‌పోరు.. శ్రేణులను కలవరపరుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సభతో ముగ్గురు మంత్రులు, విప్‌లు, అంతా ఏకమై సభ విజయవంతానికి తమ వంతుగా పనిచేసుకుంటూ పోతుండటం పార్టీలో పెరిగిన సహకారానికి నిదర్శనమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు ప్రకటించే వరాల జల్లుతో స్థానికసంస్థల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
మూడు ముక్కలాటకు సీఎం సభతో చెక్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నడుమ అంతర్గత ఆధిపత్యపోరు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా హుస్నాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నడుమ ఏ విషయంలోనూ పొసగదనేది బహిరంగరహస్యమే. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్‌బాబుది పైచేయి కావడం, కరీంనగర్‌కు సంబంధించిన నియామకాల్లోనూ ఆయనే కీలకం కావడంపై అప్పట్లో పొన్నం కినుక వహించారు. ఒక దశలో సుడా చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని భీష్మించుకొని ఉన్నా, ఇటీవల కాస్త మెత్తపడి, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని చేరువ చేసుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెనుదుమారం లేపడం తెలిసిందే. పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ముగ్గురి నడుమ అధికారులు నలిగిపోతూనే ఉన్నారు. సీఎంసభ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనబెట్టి అంతా కలిసి పనిచేస్తుండటం శుభసూచకం. ఈ మైత్రి మునుముందు కూడా కొనసాగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ ఆశాజనకంగా ఉంది.
పొన్నం ప్రభాకర్
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ఉమ్మడి జిల్లా ‘హెడ్’ క్వార్టర్ అయిన కరీంనగర్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. ఇటీవల డీసీసీ, కార్పొరేషన్ అధ్యక్షుల నియామకంతో కాసింత గాడినపడినట్టుగా కనిపిస్తున్నా, ఇప్పటికీ కరీంనగర్ ఎవరిదనే సమస్య కొనసాగుతోంది. కరీంనగర్‌కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందడం, శ్రీధర్‌బాబు పెద్దపల్లి, లక్ష్మణ్‌కుమార్ జగిత్యాల జిల్లాలకు ప్రాతినిథ్యం వహించడంతో కరీంనగర్‌లో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. పైగా కరీంనగర్ ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉండడంతో, ఆ స్థాయిలో కాంగ్రెస్‌కు నాయకుడు కనిపించడం లేదు. తాను కరీంనగర్ వాసినని పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు జోక్యం చేసుకొంటున్నా, పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా మారారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్‌కుమార్‌ను నియమించిన తరువాత పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఖాళీగానే ఉంది. దీంతో నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఎవరికీ లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ అసంపూర్తి సంస్థాగత నిర్మాణం సమస్యగా మారుతోంది. పూర్తిస్థాయిలో డీసీసీ, సిటీ, మండల కమిటీలను నియమిస్తే పార్టీలో కొత్త జోష్‌కు అవకాశముంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు, పార్టీ గుర్తులపై త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పార్టీలో సమన్వయం ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అదే కరువైంది.
జోష్ పెరిగేనా?
జోష్ పెరిగేనా?
జోష్ పెరిగేనా?
జోష్ పెరిగేనా?


