● సర్కారు ఉద్యోగులూ తస్మాత్ జాగ్రత్త ● ప్రచారం, సభలు,
కరీంనగర్ అర్బన్: ఎన్నికలంటే అన్ని వర్గాలకు సంబరమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాల్సిందే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగుతున్నందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. ఉద్యోగులు ఏ మాత్రం అనుచితంగా వ్యవహరించినా వేటు వేయడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయడం తగదని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ పోస్టులపై కూడ ఓ కన్నేసింది.
సభలు.. సమావేశాలు వద్దు
ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకుని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాద్యమాల్లో పొందుపరిచినా నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడిది పెను ముప్పే. ఆడియో, వీడియోల ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి కానీ అందుబాటులో ఉన్న యంత్రాంగానికి పంపినా లేదా ప్రచార మాధ్యమాల్లో పోస్టు చేసినా అంతే సంగతులని గత ఉదంతాలు చాటుతున్నాయి. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తూనే అంగన్‌వాడీలపై వేటు వేశారు. గతంలో అంగన్‌వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఫోన్‌లు చేసి మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు.
సెల్‌ఫోన్లతో కష్టాలు
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. స్మార్ట్‌ఫోన్లు లేనివారు లేకపోగా ఆధునాతన ఫీచర్లను వినియోగిస్తున్నారు. ఉద్యోగులు సెల్‌ఫోన్ ద్వారా విస్తృతంగా వాడుతున్న ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది.
ఉద్యోగులు ఎటువైపు..?
సర్పంచి ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఏరికొరి ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలముంటే, మరికొన్ని సంఘాలు ప్రతికూలమంటున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని మాత్రమే చూస్తామని, ఏ పార్టీ వ్యక్తన్నది అనవసరమని ఉద్యోగులు చెబుతున్నారు.


