బీమా చేసి.. అన్నను చంపేసిండు
సొంత అన్నపై ఇన్సూరెన్స్ చేయించి
డబ్బుకోసం టిప్పర్ ఎక్కించి చంపిన తమ్ముడు
రూ.4.14 కోట్లు పొందేందుకు పథకం
ముగ్గురు నిందితులు అరెస్టు
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: వ్యాపారం, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత అన్న హత్యకే మరణశాసనం రచించాడు. అన్నపై రూ.4.14 కోట్ల బీమా చేయించాడు. ఆపై టిప్పర్‌తో ఢీకొట్టి హత్యచేసి, బీమా సొమ్ము పొందేందుకు పథకం వేశాడు. పోలీసు దర్యాప్తులో విషయం తేలడంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కరీంనగర్‌జిల్లాలోని రామడుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరీంనగర్ సీపీ గౌస్‌ఆలం మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రామడుగు గ్రామానికి చెందిన మామిడి నరేశ్(30) టిప్పర్లు నడిపిస్తుంటాడు. షేర్ మార్కెట్‌తో పాటు వివిధ వ్యాపారాలు చేసి రూ.1.50కోట్ల వరకు నష్టపోయి, అప్పుల పాలయ్యాడు. అప్పు తీర్చేందుకు మానసిక పరిపక్వత లేని, ఇంకా వివాహం కాని సొంత అన్న మామిడి వెంకటేశ్(37)ను చంపాలని నిర్ణయించుకున్నాడు. గత రెండు నెలల క్రితం అతనిపై నాలుగు ప్రైవేటు, రెండు ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.4.14 కోట్లు వచ్చే విధంగా పాలసీలు చేయించాడు. రూ.20 లక్షల బంగారం రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో రాకేశ్ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన రూ.7 లక్షల గురించి నరేశ్‌పై ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నను చంపుతున్నానని, సహకరిస్తే రూ.13 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇద్దరు కలిసి టిప్పర్ డ్రైవర్ ప్రదీప్‌ను ఒప్పించారు. విషయం బయటపడితే ముగ్గురు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ప్రణాళిక రచించే సమయంలో వీడియో రికార్డింగ్ చేసుకున్నారు. పథకం ప్రకారం.. నవంబర్ 29న రాత్రి నరేశ్ డ్రైవర్ ప్రదీప్‌కు టిప్పర్‌లో మట్టిలోడ్ నింపుకురావాలని చెప్పాడు. రాత్రి 11 గంటల తర్వాత టిప్పర్ బ్రేక్‌డౌన్ అయిందని ప్రదీప్ నరేశ్‌కు ఫోన్ చేశాడు. గ్రామశివారులోని పెట్రోల్ బంక్ వద్ద టిప్పర్ ఆగిపోయిందని, జాకీ ఇచ్చిరమ్మని నరేశ్ వెంకటేశ్‌ను తమ బంధువు సాయిని ఇచ్చి స్కూటీపై పంపించాడు. కాసేపటికి నరేశ్ టిప్పర్ వద్దకు చేరుకున్నాడు. వెంకటేశ్‌ను టిప్పర్ కింద పడుకుని జాకీ తిప్పమని చెప్పి నరేశ్ టిప్పర్ ఎక్కాడు. వెంకటేశ్ సెల్‌ఫోన్ లైట్ పెట్టుకొని జాకీ తిప్పుతుండగా టిప్పర్ స్టార్ట్ చేసి ఎక్కించడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్ టిప్పర్ డ్రైవర్ ప్రదీప్‌ను పారిపోవాలని సూచించాడు. తన అన్నను ప్రదీప్ చంపాడని ఫిర్యాదు చేయాలని భావించాడు. కానీ టిప్పర్‌ను నరేశే నడిపాడని అతని తండ్రి మామిడి నర్సయ్యకు సాయి చెప్పాడు. నరేశ్ టిప్పర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు ఢీకొని వెంకటేశ్ మృతిచెందినట్లు ఫిర్యాదు చేశారు. రామడుగు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రమాదం జరిగిన తీరు, బీమా పత్రాలు పరిశీలించారు. పథకం ప్రకారమే హత్య చేశారని నిర్ధారించారు. నరేశ్, రాకేశ్, ప్రదీప్‌ను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. కేసును త్వరగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, రామడుగు ఎస్సై రాజును సీపీ అభినందించి, రివార్డు అందించారు.


