ఉందామా? తప్పుకుందామా?
మొదటి విడతలో మిగిలిన నామినేషన్లు
కరీంనగర్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పోటీ చేయడంపై కసరత్తు చేస్తున్నారు. గెలుపోటములపై అంచనా వేస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, అనుకూలంగా ఉన్న ఓట్లు, ప్రత్యర్థులకు పడే ఓట్ల వివరాలు సేకరిస్తున్నారు. పోటీ చేసేందుకు సిద్ధపడిన కొందరు ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా పెద్దలతో సంప్రదింపులు, రాయబేరాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ మండలంలో మొదటి విడతలో 132వార్డులకు 25వార్డుస్థానాలు ఏకగ్రీవం కాగా.. మంగళవారం రాత్రి జరిగిన చర్చల్లో నల్లగుంటపల్లిలో మిగిలిన మూడు వార్డుస్థానాలు సైతం ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. రెండు రోజుల నుంచి ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అభ్యర్థులు చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో కాసేపట్లో తెలుస్తుంది.
నామినేషన్ ఉపసంహరణ చేయాలంటే
ఏకగ్రీవాలకుకు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ పోటీదారులపై తీవ్రమైన ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ప్రత్యేక గైడ్‌లైన్స్‌జారీ చేసింది. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థి సంబంధిత రిటర్నింగ్ అధికారికి బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోపు ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందినట్లయితేనే నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాటవుతోంది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేసినట్లయితే క్షేత్రస్థాయిలో ఆర్‌వో విచారణ చేసే అవకాశముంది.
సింగిల్ నామినేషన్‌కు
సర్పంచు, వార్డుసభ్యుల స్థానాలకు ఒక్కటే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా గెలిచినట్లవుతోంది. సదరు అభ్యర్ధి స్వీయ ధ్రువీకరణ పత్రం రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్‌వో డిక్లరేషన్ పరిశీలించి ఆమోదిస్తేనే ఆ పదవి ఏకగ్రీవమవుతోంది. ఏకగ్రీవమైన పదవుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఆర్‌వోలు పంపించినట్లయితే గెజిట్ విడుదల చేస్తారు. అనంతరం ఏకగ్రీవ అభ్యర్థులు గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
మండలం సర్పంచ్ వార్డు
మెంబర్
చొప్పదండి 80 332
గంగాధర 169 643
రామడుగు 108 480
కరీంనగర్ రూరల్ 68 301
కొత్తపల్లి 38 183
మొత్తం 463 1,939


