
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
కొడిమ్యాల/మల్యాల: వారిద్దరూ స్నేహితులు. ఒకరు ముంబయిలో ఉంటూ వంట పనులకు వెళ్తున్నాడు. మరొకరు స్థానికంగా ఉంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ముంబయి నుంచి స్నేహితుడు రావడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై వేములవాడ వెళ్లేందుకు బయల్దేరారు. ఇంతలోనే వారిని విధి వెక్కిరించింది. బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది. మృతులిద్దరిది మల్యాల మండలకేంద్రం. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ సోమయ్య, లత దంపతుల కుమారుడు గణేశ్.. దయాల మల్లేశం కుమారుడు రాజ్‌కుమార్ స్నేహితులు. గణేశ్ తండ్రి సోమయ్య ఇరవై ఏళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి లత గణేశ్‌ను పోషిస్తుండగా ఆయన ఆమెకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రాజ్‌కుమార్ తల్లి గతంలోనే చనిపోయింది. మల్లేశం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజ్‌కుమార్ కొన్నాళ్లుగా ముంబయిలో ఉంటూ అక్కడే వంట పనులకు వెళ్తున్నాడు. ఓ కేసు నిమిత్తం రాజ్‌కుమార్ రెండు రోజుల క్రితం మల్యాలకు వచ్చాడు. స్నేహితుడైన గణేశ్‌తో సరదాగా గడిపారు. గణేశ్ మంగళవారం పులి వేషంవేసి వేశాడు. బుధవారం ఇద్దరూ కలిసి వేములవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం నల్లగొండ శివారుకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో దయ్యాల రాజ్ కుమార్ (25), జడ గణేశ్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు కొడిమ్యాల పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు విడవడంతో మల్యాలలో విషాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం