
ఎరువులపై పక్కా నిఘా
● శాంపిల్స్ సేకరణకు ఆదేశాలు
● అక్రమాలకు అడ్డుకట్ట
కరీంనగర్ అర్బన్: ఎరువుల విక్రయాల్లో అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రికార్డుల నిర్వహణతో పాటు తనిఖీలకు ఆదేశించింది. పంటల సాగులో విత్తనాలు, ఎరువులే దిగుబడులపై ప్రభావం చూపుతాయి. ఎరువుల ద్వారానే పంటలకు పోషకాలు అందుతాయి. నత్రజని, భాస్వరం, పొటాష్, డీఏపీ, ఎన్పీకే కాంప్లెక్సులు, ఎన్పీకే మిక్సర్లు, నీటిలో కరిగేవి, సూక్ష్మపోషకాలు, సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, నానో డీఏపీ, తదితర రకాల ఎరువులు లభ్యమవుతాయి. ఈ క్రమంలో వర్దిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారం ఎరువుల పరిమాణం, నాణ్యతపై నియంత్రణను సూచిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ గ్రామం, మండలం, జిల్లాల వారీగా పంటల సాగు విస్తీర్ణం అంచనాల ప్రకారం ఎరువుల వినియోగంపై అధికారులు ప్రణాళిక రూపొందిస్తారు. మండల స్థాయిలో ఫర్టిలైజర్ ఇన్‌స్పెక్టర్‌గా ఏఓ వ్యవహరిస్తుండగా ఎరువుల నాణ్యతను తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తారు. ప్రణాళిక ప్రకారం ఎరువులు అందుబాటులో ఉంచేలా కలెక్టర్ పర్యవేక్షిస్తుండగా వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన ఎరువుల రిటైల్ డీలర్లు, సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారు.
ఈపాస్ యంత్రం ద్వారా అమ్మకాలు
ఎరువుల అమ్మకాలు ఈపాస్ యంత్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. రైతులు తమ ఆధార్ కార్డు చూపించి ఈపాస్ యంత్రం ద్వారా ఎరువులు తీసుకోవడం జరిగే ప్రక్రియ. దుకాణ నిర్వాహకులు పారదర్శకంగా వ్యవహరించేలా ఈపాస్ ఉపయోగపడనుండగా పక్కదారి ఏ మాత్రం అస్కారం లేదు. దీని ద్వారా ఎరువుల దుకాణంలో భౌతిక నిల్వ, ఈపాస్ యంత్రంలో నిల్వ సరిపోవాలి. అంటే ఎరువుల నిల్వలు, అమ్మకాలు పారదర్శకంగా ఉండనున్నాయి.
శాంపిల్స్ సేకరణతో చర్యలు
ఈ సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 10వేల ఎరువుల నమూనాలు సేకరించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్యం నిర్దేశించారు. జిల్లాలో 510 నమూనాలు తీసుకోనున్నారు. ఎరువుల నమూనాల విశ్లేషణలో ప్రమాణాలకు భిన్నంగా ఉంటే.. అలాంటి వాటిని ‘నాన్ స్టాండర్డ్’గా వ్యవహరిస్తా రు. ఇలాంటి ఎరువులు విక్రయించే డీలర్లపై న్యా య, పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటారు.
అక్రమాలకు అడ్డుకట్ట
ఎరువుల దుకాణాల్లో నిల్వలు, అమ్మకాల నియంత్రణకు వ్యవసాయశాఖ ‘ఫైవ్స్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్నే ‘ఫర్టిలైజర్ వెరిఫికేషన్ సిస్టం’ అంటారు. ఇందులో భాగంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకుడు, మండల వ్యవసాయశాఖ అధికారులు ప్రతీ వారంలో రెండు సార్లు ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. రిజిస్టర్‌లో నిల్వలు, భౌతిక నిల్వలు, ఈపాస్ యంత్రంలోని నిల్వలను యాప్‌లో నిక్షిప్తపరుస్తారు. రిజిస్టర్లోనూ ధ్రువీకరిస్తారు. తేడాలేమైనా ఉంటే ఫర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. ఎరువుల విక్రయాలపై పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలుంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు.
ఎరువుల అవసరమిలా
(మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 26,850
డీఏపీ 43,097
ఎంవోపీ 10,201
కాంప్లెక్స్ 24,540
ఎస్‌ఎస్‌పీ 11,089