
అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
కరీంనగర్‌క్రైం: ప్రభుత్వ భూములను ఆక్రమించేవారిపై, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. శనివారం కమిషనరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భూములకు సంబంధించి చట్టాలకనుగుణంగా నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. చిట్‌ఫండ్ మోసాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టంను సరైన పద్ధతిలో అమలు చేయాలని ఆదేశించారు. ఆకస్మికంగా తలెత్తే శాంతిభద్రతల సమస్యలు ఎదుర్కొనేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ బారికేడ్‌లు, లాఠీలు, హెల్మెట్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రౌడీ, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి (టౌన్), హుజురాబాద్ ఏసీపీ వి.మాధవి, యాదగిరి స్వామి (ట్రాఫిక్), శ్రీనివాస్ (ఎస్బీ), వేణుగోపాల్ (సీటీసీ) తదితరులు పాల్గొన్నారు.