
విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం
● డీటీసీ పురుషోత్తం
తిమ్మాపూర్(మానకొండూర్): విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విద్యాసంస్థల బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. గురువారం తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ పురుషోత్తం ఆధ్వర్యంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీటీవో చక్రవర్తి మాట్లాడుతూ, జిల్లాలో 666 స్కూల్ బస్సుల్లో 550 మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని, గతేడాది విద్యాసంస్థల వాహనాల వల్ల ప్రమాదాలు జరగలేదని, దీంతో కరీంనగర్ ప్రమాదరహిత జిల్లాగా నిలిచిందని అభినందించారు. స్కూల్ బస్సులు పూర్తిగా పసుపు రంగులో, పిల్లల బొమ్మలతో, అటెండర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 60 ఏళ్లు దాటినవారు, ఆరోగ్య సమస్యలున్నవారు డ్రైవింగ్ చేయరాదని ఆదేశించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఉపయోగించకూడదని, ప్రతీ 10 బస్సులకు ఒక అదనపు బస్సు సిద్ధంగా ఉంచాలన్నారు. ట్యాక్స్ బకాయిలు లేకుండా చూడాలన్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు రవాణా శాఖ చిల్డ్రన్ పార్క్‌లో అవగాహన కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధి యాదగిరి శేఖర్‌రావు మాట్లాడుతూ, స్కూల్ బస్సులను వివాహాలు, రాజకీయ కార్యక్రమాల కోసం అడగవద్దని, నష్టం జరిగితే యాజమాన్యంపైనే భారం పడుతుందని విజ్ఞప్తి చేశారు.
శిక్షణతో పాఠశాల విద్య బలోపేతం
కొత్తపల్లి(కరీంనగర్): పాఠశాల విద్య బలోపేతానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. శిక్షణ తరగతులను కింది స్థాయి ఉపాధ్యాయుల వరకు చేర్చవలసిన బాధ్యత జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్‌పైన ఉందని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అన్ని మండలాల్లో శిక్షణ తరగతుల సమయం ఒకే విధంగా ఉండేలా జిల్లా స్థాయిలోనే తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడు అప్‌డేట్ అవుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. డీఈవో జనార్దన్‌రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఆంజనేయులు, ఆనందం, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ బద్ధిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని బద్ధిపల్లి, నాగులమల్యాల, కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆకట్టుకున్న సాయిబాబా జీవిత చరిత్ర
కరీంనగర్‌కల్చరల్: మన సమైక్యత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కళాభారతిలో షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర నాటక ప్రదర్శన అలరించింది. సంస్థ అధ్యక్షుడు రొడ్డ యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్టీవ్ దేవేందర్, చిందం శ్రీనివాస్, నెల్లుట రవీందర్‌రావు, సంస్థ కార్యదర్శి అగస్టీన్, కెప్టెన్ మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.

విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం