అభ్యర్థుల కార్యకలాపాలపై డేగకన్ను
● ఎన్నికల కోడ్ అమలుకు
ప్రత్యేక బృందాల ఏర్పాటు
● పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు
ఎల్లారెడ్డి: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా...ప్రలోభ రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నామినేషన్ల ఘట్టం పూర్తయి రంగంలో ఉన్న అభ్యర్థుల కార్యకలాపాలపై ఈ ప్రత్యేక బృందాలు అనుక్షణం డేగకన్నుతో పరిశీలిస్తుంటాయి. ప్రచార పర్వంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా ని యమావళిని పాటిస్తున్నారా లేదా అని ప్రత్యేక దృష్టి పెడతారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు స్వే చ్ఛాయుత వాతావరణాన్ని కల్పించేందుకు ఏర్పా టు చేసిన ప్రత్యేక బృందాల గురించి పరిశీలిస్తే..
● మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం..
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచార సరళి, వారు పెడుతున్న ఖర్చు, చెల్లింపులను పరిశీలించేందుకు మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో నలుగురు సిబ్బంది ఉంటారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఒక్కొక్కరు, వీడియోగ్రాఫర్, సహాయకుడు ఈ బృందంలోని సభ్యులు. వీరు అనుక్షణం అభ్యర్థుల ప్రవర్తనా నియమావళిని పరిశీలిస్తుంటారు.
● ఎఫ్‌ఎస్‌టీ బృందం(ఫ్లయింగ్ స్క్వాడ్ టీం)
గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రలోభాలను అరికట్టేందుకు మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక గెజిటెడ్ అధికారి, ఇద్దరు పోలీసులు, ఒక వీడియోగ్రాఫర్ కలిసి నలుగురు సభ్యులు ఉంటారు. పంచాయతీ ఎన్నికలలో నగదు, మద్యం పంపిణీ, బహుమతుల అందజేత తదితర అంశాలపై వీరు దృష్టి సారిస్తారు. ఎక్కడైనా మద్యం, ఇతర ప్రలోభాల నిల్వలు ఉన్నట్లు సమాచారం అందితే వీరు అక్కడకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు. మూడు షిప్టుల్లో 24 గంటలు ఈ బృందం పనిచేస్తుంటుంది.
● ఎంసీఎంసీ బృందం
అభ్యర్థులు దినపత్రికలు, టీవీ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో ఇచ్చే ప్రకటనల ఖర్చులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేట్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) పేరిట ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుంటుంది. వీరు ప్రతి రోజూ పలు మాధ్యమాలలో వచ్చే అభ్యర్థుల ప్రకటనలను పర్యవేక్షిస్తుంటారు.
● ఎస్‌ఎస్‌టీ బృందం..
అభ్యర్థుల ఎన్నికల కోసం మద్యం, డబ్బు తరలింపు, బహుమతుల సమీకరణ తదితర అంశాలపై పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో పోలీసు, అటవీ, ఎకై ్సజ్ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందం జిల్లా సరిహద్దులో పర్యవేక్షణ చేస్తుంటుంది.
● ఖర్చు పద్దుల కోసం ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లు
పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎంతమేరకు ఖర్చు చేస్తున్నారో పర్యవేక్షించేందుకు ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుపై నిఘా పెట్టేందుకు వ్యయ పరిశీలకుల బృందాలను జిల్లా స్థాయిలో ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్, మండల స్థాయిలో అసిస్టెంట్ ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లు ఉంటారు. ఈ బృందంలో ఒక అధికారి ఒక పరిశీలకుడు ఉంటారు.


