క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Dec 4 2025 7:14 AM | Updated on Dec 4 2025 7:14 AM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి ఒకరిపై కత్తితో దాడి జాతీయ రహదారిపై లారీ బోల్తా జింకను వేటాడిన నిందితుల అరెస్టు

బోధన్‌రూరల్‌: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన మేరే దేవరాజ్‌ (27) బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం బోధన్‌ వెళ్లి తిరిగి వస్తుండగా లంగ్డాపూర్‌ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దేవరాజ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య దివ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి సమీపంలోని రామేశ్వర్‌పల్లి వద్ద ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు రూరల్‌ సీఐ రామన్‌ తెలిపారు. రామేశ్వర్‌పల్లి వద్దనున్న డబుల్‌ బెడ్రూం కాలనీలో నివాసం ఉండే సుతారి రాజశేఖర్‌, గంగని ప్రవీణ్‌ కలిసి మంగళవారం రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇళ్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మద్యం సేవించారు. అక్కడే వారి మధ్య మాటామాటా పెరిగి కత్తిపోట్ల వరకు వెళ్లింది. ప్రవీణ్‌ కత్తితో రాజశేఖర్‌పై దాడి చేసి కడుపులో పొడిచాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు రిఫర్‌ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్‌ చికిత్స పొందుతున్నాడు. రూరల్‌ సీఐ రామన్‌ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపారు. ఇద్దరి మధ్య పాతకక్షలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్‌పై హత్యా యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం బంగాళదుంపల లోడ్‌తో వస్తున్న లారీ బోల్తాపడింది. నిర్మల్‌ నుంచి ఆర్మూర్‌ వెళ్తున్న లారీ అతివేగంగా రావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): జింకను వేటాడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోర్గాం గ్రామానికి చెందిన గంధం విజయ్‌, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్‌ వారం రోజుల క్రితం మల్లారం గుట్ట ప్రాంతంలో జింకను వేటాడారు. నలుగురిని బుధవారం ఉదయం పట్టుకొని విచారించగా జింకను వేటాడి చంపినట్లు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement