ఇక మూడో విడత!
ఏకగ్రీవాల కోసం ముమ్మర ప్రయత్నాలు..
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించిన నామపత్రాల దాఖలు ప్రక్రియ ముగియగా.. బుధవారంనుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ మొదలవడంతోపాటు తొలి విడతలో బరిలో మిగిలే అభ్యర్థుల లెక్క కూడా తేలనుంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం వాటిని పరిశీలిస్తారు. ఇక మూడో విడత నామినేషన్ల ఘట్టం సైతం బుధవారమే మొదలుకానుంది.
వేడెక్కిన ‘పంచాయతీ’..
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియగా.. బుధవారంనుంచి మూడో విడత ప్రక్రియ మొదలు కానుంది. దీంతో జిల్లా అంతటా ఎన్నికల వేడి పెరిగింది. ఏ ఊరుకువెళ్లినా పంచాయతీ ఎన్నికల గురించిన చర్చే జరుగుతోంది. చిన్నచిన్న పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి విడతలో పది మండలాల పరిధిలోని 167 గ్రామాల సర్పంచ్ పదవులకు నామినేషన్ల పరిశీలన తరువాత 951 మంది అభ్యర్థులు మిగిలారు. అలాగే 1,520 వార్డులకు 3,709 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, ఎంత మంది బరిలో మిగిలారనే లెక్క తేలనుంది. ఇక రెండో విడతకు సంబంధించి ఏడు మండలాల పరిధిలోని 197 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు 1,654 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 6వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇక మూడో విడతలో ఎనిమిది మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్ మండలాల పరిధిలోని 168 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవులతో పాటు 1,482 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 5 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రెండు విడతలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఓట్ల వేటపై దృష్టి సారించారు. బుధవారం తొలి విడతకు సంబంధించిన ఉపసంహరణ గడువు ముగియనుంది. బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ చేయనున్నారు.
నాగిరెడ్డిపేటలో నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్న సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు
జిల్లాలోని పలు పంచాయతీల పాలకవర్గాలను ఏకగ్రీవం చేయడానికి ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలి విడ తలో 167 పంచాయతీల్లో ఇప్పటికే ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ ఏకగ్రీవాలతో పంచాయతీలను తమ ఖా తాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే రెండో విడతలో 197 పంచాయతీల పరిధిలో నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో వాటిపైనా ఆయా ప్రాంతాల నేతలు దృష్టి సా రించారు. ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండో విడతలో దాఖలైన నామినేషన్లు..
పంచాయతీ ఎన్నికలలో ముగిసిన
రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ
నేటి నుంచి మూడో విడత
నామినేషన్లు షురూ...
తొలి విడతలో బరిలో
మిగిలిన వారి లెక్క తేలేదీ నేడే


