అప్పుల ఊబిలో వ్యాపారి
● లేఖ రాసి, కుటుంబంతో సహా అదృశ్యం
కామారెడ్డి టౌన్ : అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఓ ప్రముఖ కిరాణా వ్యాపారి.. లేఖ రాసి కుటుంబంతో సహా అదృశ్యమైన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వేధింపులు, అప్పులు తదితర అంశాలపై లేఖ రాసి దుకాణం గోడకు అతికించి అదృశ్యమైన ఘటన వ్యాపారుల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. కిరాణం, కట్‌మిట్ వ్యాపారి జిల్లా కేంద్రంలోని రాంమందిర్ రోడ్‌లో చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. గతంలో పలుమార్లు కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రాంమందిర్ రోడ్‌లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పుల పాలైన ఆయన.. రెండు పేజీలతో కూడిన లేఖను రాసి తన దుకాణం గోడకు అతికించి భార్య, ఇద్దరు కుమారులతో సహా అదృశ్యమయ్యారు. మంగళవారం దీనిని గమనించినవారు అవాక్కయ్యారు. కొన్ని ఏజెన్సీలు, వ్యాపారులకు, బ్యాంకులకు కలిపి రూ. 1.85 కోట్ల మేర బాకీ ఉన్నానని, తనకు ఇతర వ్యక్తులనుంచి రూ. 35 లక్షలు రావాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఓ వ్యాపారి తనను, కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురి చేస్తున్నాడని, అతని వల్ల ప్రాణహాని ఉందని, అందుకే కుటుంబంతో సహా కామారెడ్డి పట్టణం విడిచి వెళ్లిపోతున్నానని రాశాడు. కొన్ని నెలల తర్వాత కామారెడ్డికి వచ్చి తన అస్తులను అమ్మి అందరి అప్పులు తీరుస్తానని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ లేఖ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.


