
క్రైం కార్నర్
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రం సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపైగల రామారెడ్డి బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి ఓ లారీ సర్వీస్ రోడ్డులోకి వెళ్లి రివర్స్ తీసుకుంటుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓంకారం పార్తీ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిలేష్, మహేష్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గాయపడిన వారిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ కింద పడి యువకుడు..
నందిపేట్/డొంకేశ్వర్: పొలం దమ్ము చేస్తుండగా కేజ్‌వీల్స్ ట్రాక్టర్ కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలం శాపూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన అవుట్ల నరేశ్(36) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఈ నెల 4న సాయంత్రం అతడు శాపూర్ శివారులోని అల్లూరి ప్రదీప్ రెడ్డికి చెందిన పొలాన్ని దమ్ము చేయడానికి వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న నరేశ్ బురదలో పడిపోగా కేజ్‌వీల్ అతని పైనుంచి వెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి వచ్చి చూసేసరికి నరేశ్ మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నరేశ్ భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
ఖలీల్‌వాడి: నగరంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నగరంలోని పూలాంగ్‌కు చెందిన మల్లెపూల సందీప్(36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్ మనస్తాపం చెంది శుక్రవారం సాయంత్రం చెదల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడు భార్యకు సమాచారం అందించడంతో వెంటనే కుటుంబసభ్యులు అతడిని గుర్తించి, చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

క్రైం కార్నర్