
అత్తను హత్యచేసిన అల్లుడి అరెస్టు
పిట్లం(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అత్తను హత్య చేసిన అల్లుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు బాన్సువాడ సీఐ రాజేష్ తెలిపారు. బాన్సువాడ రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మీ (50) మూడేళ్ల క్రితం అల్లుడైన జిన్న బాగరాజుకు రూ.లక్ష అప్పుగా ఇచ్చింది. డబ్బులు ఇవ్వమని అల్లుడిని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేడు. ఇటీవల బాగరాజు తను పండించిన జొన్నలను విక్రయించగా వచ్చిన డబ్బులను అత్త అకౌంట్‌లో వేయించాడు. ఆ డబ్బుల కోసం అతడు అత్తను అడిగాడు. తనకు ఇవ్వాల్సిన బాకీ కింద ఆ డబ్బులు జమచేసుకుంటానని అత్త అతడికి తెలిపింది. దీంతో పగ పెంచుకున్న బాగరాజు తన అత్తను చంపాలని పథకం పన్ని గురువారం మధ్యాహ్నం ఆమైపె కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజే నిందితుడు తన బైక్‌పై హత్యకు ఉపయోగించిన కమ్మ కత్తితో పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.