
టీచర్‌గా మారిన కలెక్టర్
రాజంపేట: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ టీచర్‌గా మారి తలమడ్ల పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధించారు. మండలంలోని తలమడ్ల, ఆరేపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించారు. తలమడ్ల జెడ్పీహెచ్‌ఎస్, మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తలమడ్ల ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు పలు సూచనలిచ్చారు. 9, 7వ తరగతి గదులలో విద్యార్థులతో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ , జెడ్పీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో రూ.50 వేలు మంజూరు చేస్తూ మరమ్మతులు చేయించాలని ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం రమేష్ కుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఆరేపల్లిలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ జానకిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ ద్వారా ఇచ్చే రుణాల గురించి అవగాహన కల్పించాలని ఎంపీడీవో రఘురాంను ఆదేశించారు. ఆర్డీవో జ్యోతి, ఎంఈవో పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.