
మంచి పథకం.. మరుగున పడింది
ఎల్లారెడ్డి: పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్) గురించి ఇప్పటికీ ఎవరికీ అవగాహన లేకపోవడం విడ్డూరం. అకస్మాత్తుగా ఇంటి పెద్ద లేదా కుటుంబ ముఖ్య సంపాదన పరుడు మరణిస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ఈ ఎన్‌ఎఫ్‌బీఎస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఈ పథకం మరుగున పడింది. ఇంటి పెద్ద మరణించిన దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేసే ఈ పథకం గురించి కొన్నేళ్లుగా అవగాహన కల్పించే వారు లేకుండా పోయారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు నామమాత్రంగా మాత్రమే ఈ పథకానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి ఇప్పటివరకు 19 దరఖాస్తులు మాత్రమే రావడం గమనర్హం.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని 18–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముఖ్య సంపాదనపరుడు(పురుషుడు లేదా సీ్త్ర) అకస్మాతుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఇందుకు మరణించిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్) కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును అధికారులు పరిశీలించి అర్హులైన కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. మరణించిన వ్యక్తి కుటుంబంలోని వితంతు భార్యకు గాని, అవివాహిత కుమార్తెలకు గాని ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆపద్బంధు పథకం కింద కాని, ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద గాని లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాల గురించి నిత్యం ప్రచారం చేసే అధికార గణం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడే ఈ పథకం గురించి కొన్నేళ్లుగా ఊసే ఎత్తడం లేదు. పేదలకు ఎంతో కొంత ఉపయోగపడే ఈ పథకం గురించి జిల్లాలో ప్రచారం చేసేందుకు అదనపు కలెక్టర్ విక్టర్ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకం కింద అర్హులైన బాధిత కుటుంబాలు దరఖాస్తులు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
ఎన్‌ఎఫ్‌బీఎస్ గురించి
అవగాహన కరువు
ఆర్థిక సాయానికి దూరంగా
నిరుపేదలు
ఏళ్ల తరబడి ఉనికే లేని పథకం
అవగాహన కల్పిస్తున్నాం
ఎన్‌ఎఫ్‌బీఎస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న మహిళలతో, రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన కుటుంబాల సభ్యులతో మాట్లాడి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేలా మండల స్థాయి అధికారులకు ఆదేశించాం. అవగాహన లోపం కారణంగా పేదలకు ఈ పథకం దూరమైంది. పూర్తిస్థాయి ప్రచారంతో ఈ పథకం ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేస్తున్నాం.
– విక్టర్, అదనపు కలెక్టర్

మంచి పథకం.. మరుగున పడింది