
వర్షాకాలం.. పాములతో పైలం
రాజంపేట: వర్షాకాలం బీడుభూములు, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, గడ్డితో ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. మురికి నీటి గుంతలు, మడుగుల్లో నీరు నిలవడంతో కప్పలు, పాములు, విష పురుగులు బయటకొచ్చి సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండేవాళ్లు, పంట పొలాలకు దగ్గరగా నివాస ప్రాంతాలున్న వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణా ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గత సంవత్సరం వర్షాకాలంలో రాజంపేట మండలంలోని శేర్‌శంకర్ తండాకు చెందిన తండ్రి కొడుకులైన రవి, వినోద్‌లు ఇంట్లో పాముల కాటుకు గురై కాలయాపన కారణంగా చనిపోయారు. ఇంటి సరిసరాలు సరిగా లేకపోయినా, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు పాముకాటుకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..
పాములు ఎక్కువగా ఉండే ప్రాంతాలు..
పొలం, కాల్వ గట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చి మొక్కలతో నిండి పొదలు, గడ్డి వాములు, పాడుబడ్డ ఇళ్లు, ఇళ్ల ముందు పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకు వచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడ తిష్ట వేస్తాయి. నాగు పాము, కట్ల పాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి. వీటికాటుకు గురైన బాధితులకు వెంటనే వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు, కట్ల పాము వంటి 15 శాతం పాములే విషపూరితమైనవి ఉంటాయి. మిగతా పాములు కరిచినా సాధారణ చికిత్సతో నయమవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రాత్రి వేళల్లో తిరిగే వాళ్లు, అక్కడే నిద్రించే వాళ్లు టార్చ్ లైట్ వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనలను పాములు భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయానుకూలంగా వీటిని ఉపయోగించుకోవాలి. రాత్రి వేళల్లో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు వేసుకోవడం ఉత్తమం.
ప్రథమ చికిత్స ఇలా..
ముఖ్యంగా పంట పొలాల్లో
పొంచి ఉన్న ప్రమాదం
గతేడాది పాముకాటుతో
తండ్రీకొడుకుల మరణం
నాటు వైద్యంతో కాలయాపన చేయొద్దు
జాగ్రత్తలు పాటించడమే
నివారణకు మార్గం
నాటు వైద్యం వద్దు
ఎవరైనా పాము కాటు ప్రమాదం బారిన పడిన వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కొందరు నాటు వైద్యం పేరిట కాలయాపన చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. ఇళ్ల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పంట పొలాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
– విజయమహాలక్ష్మి, వైద్యులు, రాజంపేట
పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందొద్దు. పక్కవారు బాధితుడికి ధైర్యం చెప్పాలి.
పాముకాటేసిన పై భాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి.
కాటు వద్ద పదునైన బ్లేడు గాయం చేసి రక్తం కారనివ్వాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కాటేసిన పాము అంతకు ముందు ఆహారం తీసుకున్నా.. అంతకు ముందు వేరే జీవిని కాటేసినా విష ప్రభావం తక్కువగా ఉంటుంది.

వర్షాకాలం.. పాములతో పైలం