
యూరియా కోసం ఆందోళన
గాంధారి: సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్ద గాంధారి–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోఖో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలి వచ్చి క్యూలో నిల్చుంటున్నామని, అయినా అందరికీ దొరకడం లేదని పేర్కొన్నారు. ప్రైవేట్ దుకాణాలలో వారిచ్చే ఇతర రసాయనాలను కొనుగోలు చేస్తేనే యూరియా అమ్ముతున్నారని ఆరోపించారు. యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు శంకర్‌రావు, రావు సాహెబ్‌రావు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.