
రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
కామారెడ్డి క్రైం : ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడం, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మంగళవారం ఆయన 2024–25 అర్ధ వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లాలో నేరాలు, కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 28 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెల్‌ఫోన్‌ల రికవరీలో రాష్ట్రంలోని కమిషనరేట్‌లు మినహా జిల్లాలలో కామారెడ్డి అగ్రస్థానంలో ఉందన్నారు. హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి వరకు 192 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి స్పౌస్, సీనియారిటీ, హెల్త్ గ్రౌండ్స్ పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు. జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోగా వారి కుటుంబ సభ్యులకు 2 నెలల్లోనే కారుణ్య నియామకాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. డయల్ 100 కు సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది చేరుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కేసుల సంఖ్యను మరింతగా తగ్గించే విధంగా, జిలాల్లో నేరాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నేర సమీక్ష నివేదికలోని వివరాలు..
● 2024లో జూన్ నెలాఖరు వరకు జిల్లాలో 317 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 152 కేసుల్లో 160 మంది చనిపోయారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 282 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 120 ప్రమాదాల్లో 125 మంది మరణించారు. గతేడాదితో పోలిస్తే 22 శాతం మరణాలు తగ్గాయి.
● గతేడాది తొలి ఆరు నెలల్లో లైసెన్స్ లేని 75,179 మందికి చలానాలు విధించారు. అతివేగంగా వాహనాలు నడిపినందుకు 43,348, హెల్మెట్ లేనందుకు 16,340, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 5,942 చలాన్‌లను విధించారు.
● దొంగతనం కేసులు గతేడాది జూన్ ఆఖరువరకు 259 నమోదయ్యాయి. ఈసారి 214 కు తగ్గాయి. రాత్రి సమయాల్లో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న 11 మంది సభ్యుల ముఠా(పార్థి గ్యాంగ్)ను అరెస్ట్ చేశారు.
● గతేడాది తొలి అర్ధ భాగంలో మహిళలపై దాడులు, వేధింపులు, వరకట్నం కేసులు 174 నమోదు కాగా ఈసారి 167 కు తగ్గాయి.
● జిల్లాలో ఈ ఏడాది జూన్ చివరి వరకల్లా ఆరుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష, 12 మందికి ఏడేళ్లలోపు శిక్షలు పడ్డాయి.
● డయల్ 100కు 22,102 ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో 137 కేసులు నమోదయ్యాయి. మిగతా వాటిని సామరస్యంగా పరిష్కరించారు.
● సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3,265 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ దాదాపు రూ.7 కోట్లు. ఈ ఏడాదిలోనే 452 సెల్‌ఫోన్‌లు రికవరీ చేశారు.
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
తీసుకుంటున్నాం
ఎస్పీ రాజేశ్ చంద్ర
అర్ధ వార్షిక నేర సమీక్ష విడుదల